Several corona vaccines under production: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ ఏడాదిని మింగేసిన కరోనా మహమ్మారి అంతానికి వ్యాక్సినేషన్ మొదలై చాలా నెలలే అవుతోంది. మన దేశంలోను జనవరి 16వ తేదీన వ్యాక్సినేషన్ మొదలైంది. అయితే ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వైరస్‌అంతానికి మొదలైన పరిశోధనల్లో ఎప్పుడెప్పుడు ఎలా కొనసాగాయి? ఏ ఏ దేశాలు వ్యాక్సిన్‌ను కనుగొని.. తమ దేశాల్లో పంపిణీ చేస్తున్నాయి? ఈ అంశాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు మన ముందుకు వస్తున్నాయి.
జనవరి 3న మన దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు లభించాయి. భారత ఔషధ నియంత్రణ మండలి (డీజీసీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో దేశంలో రెండో డ్రై రన్ జనవరి 8వ తేదీన ప్రారంభం అయ్యింది. దేశంలోని అన్ని జిల్లాల్లో వ్యాక్సినేషన్ రిహార్సల్స్ ప్రక్రియ పూర్తి చేశాక.. జనవరి 16 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. మొదట దశలో 3 కోట్ల మంది ఆరోగ్య సేవల సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ పంపిణీ చేసే లక్ష్యంతో వ్యాక్సినేషన్ మొదలైంది. మార్చి ఒకటో తేదీ నుంచి రెండో దశలో 60 ఏళ్లకు పైబడిన వారికి, 45-59 మధ్య వయస్కుల్లో వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జులై 2021 నాటికి 30 కోట్ల మందికి కోవిడ్-19 వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను భారత్ కంటే ముందు బ్రిటన్, అర్జెంటీనా, ఎల్ సాల్వెడార్‌లో అత్యవసర వినియోగం కింద వాడకం ప్రారంభించారు. మన దేశంలో పరిశోధించి కనుగొని, తయారీ చేసిన కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలపై తొలి దశలో అనుమానాలు వినిపించాయి. కానీ అనుమానాలను పటాపంచలు చేస్తూ.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. మార్చి 4వ తేదీ ఉదయానికి దేశవ్యాప్తంగా కోటి 60 లక్షల మందికి వ్యాక్సిన్ చేరింది. రెండో దశలోవాక్సిన్ తీసుకున్న ప్రముఖుల్లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులున్నారు. కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకుని ప్రజలలో కరోనా టీకాలపై నమ్మకాన్ని పెంచారు నేతలు.
కోవిన్ పోర్టల్లో నమోదు చేసుకోవడం ద్వారా నిర్దేశించిన కేటగిరీకి చెందిన వారు వ్యాక్సిన్ వేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ముందుగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు మాత్రమే వ్యాక్సినేషన్ కొనసాగగా.. మార్చి 3న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి 24 గంటల్లో ఎప్పుడైనా వ్యాక్సిన్ పంపిణీ చేసుకునే వెసులుబాటును ఆసుపత్రులు, లాబోరేటరీలకు కల్పించారు. దీంతో వ్యాక్సినేషన్ మరింత వేగాన్ని పుంజుకునే అవకాశాలు ఏర్పడ్డాయి. మ్యాప్ మై ఇండియా యాప్ లేదా వెబ్‌సైట్‌లో వివరాల ద్వారా కరోనా టీకా పంపిణీ కేంద్రాల గురించి తెలుసుకునే వీలు కల్పించారు. రిజిస్టర్ చేసుకున్న వారు కోవిడ్ టీకాలు తీసుకునే సౌకర్యం వుంది.
వ్యాక్సిన్ల నేపథ్యం ఇదీ..
భారత్ బయోటెక్ టీకా కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయి. ఫలితాలను మార్చి 3వ తేదీన భారత్ బయోటెక్ వెల్లడించింది. 18-98 మధ్య వయస్సు గల మొత్తం 25,800 మందిపై నిర్వహించిన ట్రయల్స్ విజయవంతమయ్యాయి. టీకా మధ్యంతర క్లినికల్ సామర్థ్యం 80.6 శాతంగా నమోదైంది. క్లినికల్ ట్రయల్స్ 25 వేలమందిపై నిర్వహించడం దేశంలోనే ఇది తొలిసారి అని చెబుతున్నారు. మూడో దశ ట్రయల్స్‌లో పాల్గొన్న వాలంటీర్లలో 60 ఏళ్ళు పైబడిన వారు 2,433 మంది వున్నారు. ఇతర ఆరోగ్య సమస్యలున్న వాలంటీర్లు 4,500 మంది వున్నారు. మొదటి ,రెండు దశల క్లినికల్ ట్రయల్స్‌తో పోలిస్తే మూడో దశలో టీకా ఫలితాలు బాగా మెరుగైనట్లు భారత్ బయోటెక్ తెలిపింది.
రష్యా అన్ని దేశాల కంటే ముందుగా స్పుత్నిక్ వీ పేరిట కరోనా వ్యాక్సిన్‌ను డెవలప్ చేసింది. దీనిని మరికొన్ని దేశాలతోను రష్యా పంచుకుంది. ఆ దేశాలలో మన దేశం కూడా వుంది. మనదేశానికి చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఆధ్వర్యంలో స్పుత్నిక్ వీ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. త్వరలోనే అత్యవసర వినియోగానికి అనుమతి లభిస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఏప్రిల్ నెలారంభంలోగా దేశీయంగా అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఈ టీకా 91.6 శాతం మేరకు ప్రభావవంతంగా ఉందని లాన్సెట్ జర్నల్ ప్రత్యేక కథనం ప్రచురించింది. స్పుత్నిక్ వీ అందుబాటులోకి వస్తే మన దేశంలో మూడవ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. రష్యాలోని గమలేయా నేషనల్ సెంటర్‌లో స్పుత్నిక్ వీ తయారైంది. హ్యూమన్ ఎడెనోవైరస్ ప్లాట్‌ఫాంపై ఈ టీకాను రూపొందించారు. హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌లో దీని ఉత్పత్తి కొనసాగుతోంది.
నోవావ్యాక్స్ కోవీ-2373 పేరిట మరో కరోనా వ్యాక్సిన్ కూడా రెడీ అవుతోంది. నోవావ్యాక్స్ కోవీ-2373 తొలి దశలో మంచి ఫలితాలు సాధించింది. వైరస్ ప్రొటీన్ కణాల ఆధారంగా తయారైన వ్యాక్సిన్ ఇది. పుణెలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉత్పత్తి మొదలైంది. నోవావ్యాక్స్‌తో సీరమ్ సంస్థ దీన్ని రూపొందిస్తోంది. అమెరికా సహా పలు దేశాలలో రెండో దశ క్లినికల్ ట్రయల్స్ తుది దశలో వున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా ఆక్స్‌ఫర్డ్ టీకాలు అందుబాటులో వున్నాయి. జైకో వీ-డీ పేరిట డీఎన్ఏ ప్లాట్‌ఫాంపై క్యాడిలా కంపెనీ వ్యాక్సిన్ తయారు చేస్తోంది. క్యాడిలా బయోటెక్నాలజీ విభాగంతో కలిసి క్లినికల్ ట్రయల్స్ మూడో దశలో వున్నాయి.
అమెరికా హెచ్‌డీటీ ఎంఆర్ఎన్ఏ ఆధారిత మరో వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తోంది. దీని పేరు హెచ్ జీకో-19. భారత్‌లోని పుణెలోని జినోవా అనే కంపెనీ హెచ్ జీకో-19 టీకాను ఉత్పత్తి చేస్తోంది. దీన్ని ముందుగా జంతువులపై ప్రయోగించారు. ఆ ప్రయోగాలు పూర్తయ్యాయి. హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ అమెరికా థామస్ జెఫర్సన్ యూనివర్సిటీ సహకారంతో టీకా రూపొందిస్తోంది. మృత రేబిస్ వెక్టర్ ప్లాట్‌ఫాం ఆధారంగా ఈ కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతోంది. అడ్వాన్సడ్ ప్రీ-క్లినికల్ స్థాయికి టీకా తయారీ చేరుకుంది. మరోవైపు భారత్‌కే చెందిన అరబిందో ఫార్మా కూడా టీకా ఉత్పత్తిలో నిమగ్నమైంది. అమెరికా ఆరోవ్యాక్సీన్‌తో కలిసి అరబిందో ఫార్మా టీకా తయారీ చేస్తోంది. ప్రస్తుతం ప్రీ-డెవలప్‌మెంట్ దశలో ఈ టీకా తయారీ వుంది.
ప్రస్తుతం దేశంలో రెండు రకాల టీకాలు పంపిణీ అవుతుండగా.. మరో మూడు రకాల వ్యాక్సిన్లు ఏప్రిల్ నెలలో అందుబాటులోకి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో దేశంలో వ్యాక్సిన్ పంపిణీకి భారీ టార్గెట్‌ను నిర్దేశించుకున్న కేంద్ర ప్రభుత్వం.. తయారీ సంస్థలను ప్రోత్సహించడంతోపాటు.. డిస్ట్రిబ్యూషన్ యంత్రాంగాన్ని సిద్దం చేస్తున్నారు. పలు రాష్ట్రాలు వ్యాక్సిన్ పంపిణీలో యాక్టివ్‌గా పాలుపంచుకుంటున్నాయి.
ALSO READ: కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్రం కీలక నిర్ణయం.. దానిపై వున్న నియంత్రణ ఎత్తవేత