School Bus Fees: తల్లిదండ్రులకు అలర్ట్.. అక్టోబర్ 15 నుంచి బస్ ఫీజులకు UPI బంద్? కారణం ఇదే!
Maharashtra School Bus Fees UPI: అక్టోబర్ 15 నుంచి మహారాష్ట్రలో స్కూల్ బస్ ఫీజుల చెల్లింపుల విషయంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొత్త లావాదేవీ ఛార్జీల కారణంగా యూపీఐ చెల్లింపులను నిలిపివేయాలని స్కూల్ బస్ ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. ఇక తల్లిదండ్రులు ఫీజులు ఎలా చెల్లించాలి? పూర్తి వివరాలు తెలుసుకోండి.

UPI Payments: యూపీఐ లావాదేవీలపై అక్టోబర్ 15 నుంచి మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలు అమల్లోకి రానుండటంతో దేశ వ్యాప్తంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని స్కూల్ పిల్లల తల్లిదండ్రులకు కీలక సమాచారం వచ్చింది. అక్టోబర్ 15 నుంచి పిల్లల స్కూల్ బస్ ఫీజులను యూపీఐ (UPI) ద్వారా చెల్లించడానికి వీలుండకపోవచ్చు. స్కూల్ బస్ ఓనర్స్ అసోసియేషన్ (SBOA) యూపీఐ చెల్లింపులను నిలిపివేయాలని నిర్ణయించింది. కొత్త లావాదేవీ ఛార్జీల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు ఫోన్‌పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపు విధానాల ద్వారా బస్ ఫీజులు చెల్లిస్తున్న తల్లిదండ్రులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సి రావచ్చు.
అక్టోబర్ 15 నుంచి యూపీఐ చెల్లింపులు నిలిపివేత
మహారాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ బస్ ఆపరేటర్లకు ప్రాతినిధ్యం వహించే స్కూల్ బస్ ఓనర్స్ అసోసియేషన్ గురువారం ఈ మేరకు సర్క్యులర్ విడుదల చేసింది. అక్టోబర్ 15 నుంచి స్కూల్ బస్ ఫీజులను యూపీఐ ద్వారా స్వీకరించబోమని అందులో పేర్కొంది. సాధారణంగా ఆరు నెలలకు సంబంధించిన స్కూల్ బస్ ఫీజులు రూ.2,000 కంటే ఎక్కువగా ఉండటంతో, యూపీఐ ద్వారా ఫీజుల వసూళ్లు తమకు ఆర్థికంగా భారంగా మారుతున్నాయని అసోసియేషన్ తెలిపింది.
యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు ఎందుకు?
రూ.2,000 కంటే ఎక్కువ విలువైన కొన్ని యూపీఐ లావాదేవీలపై అక్టోబర్ 15 నుంచి మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలు అమల్లోకి రానున్నట్లు వచ్చిన సమాచారం ఈ నిర్ణయానికి కారణమైంది. ఈ ఛార్జీల వల్ల పేమెంట్ గేట్‌వేల ద్వారా లావాదేవీలు నిర్వహించడానికి అదనపు ఖర్చు అవుతుందని స్కూల్ బస్ ఆపరేటర్లు చెబుతున్నారు. అసోసియేషన్ విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం, రూ.2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీపై రూ.200 వరకు ఛార్జీ విధిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఈ ఛార్జీలకు సంబంధించిన నిబంధనలు, వర్తించే లావాదేవీల వివరాలను అధికారికంగా ధ్రువీకరించుకోవాల్సి ఉంది.
తల్లిదండ్రులు ఫీజులు ఎలా చెల్లించాలి?
యూపీఐ చెల్లింపులు నిలిపివేస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు నగదు కానీ, చెక్కు లేదా క్రెడిట్ కార్డు వంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా స్కూల్ బస్ ఫీజులు చెల్లించాలని అసోసియేషన్ సూచించినట్లు సమాచారం. ఇప్పటికే డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడిన తల్లిదండ్రులు ఇకపై ఫీజులు చెల్లించే ముందు తమ స్కూల్ బస్ ఆపరేటర్లను సంప్రదించి, అందుబాటులో ఉన్న చెల్లింపు విధానాలను తెలుసుకోవడం మంచిది.
కేంద్ర ఆర్థిక మంత్రికి అసోసియేషన్ విజ్ఞప్తి
ఈ ఛార్జీల నుంచి స్కూల్ బస్సులకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రికి ఇప్పటికే ఈమెయిల్ పంపినట్లు SBOA అధ్యక్షుడు అనిల్ గార్గ్ తెలిపారు. స్కూల్ బస్సులు, పెట్రోల్ బంకులు, వాహన విడిభాగాల వ్యాపారాలను అత్యవసర సేవలుగా పరిగణించి, అదనపు ఛార్జీల నుంచి మినహాయించాలని కోరినట్లు అసోసియేషన్ వెల్లడించింది.
కొత్త నిబంధనల నేపథ్యంలో తమ పెట్రోల్ బంకులు, విడిభాగాల సరఫరాదారులు కూడా యూపీఐ చెల్లింపులను స్వీకరించడానికి నిరాకరిస్తున్నారని అసోసియేషన్ పేర్కొంది. తమ విజ్ఞప్తికి మినహాయింపు లభించకపోతే యూపీఐ ద్వారా ఫీజుల వసూళ్లను శాశ్వతంగా నిలిపివేయాల్సి వస్తుందని హెచ్చరించింది. అయితే, మహారాష్ట్రలో యూపీఐ చెల్లింపులపై ప్రారంభమైన ఈ పరిణామం ఇతర రాష్ట్రాల్లోనూ అమలయ్యే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.
