Puri Jagannadh: కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు మౌనంగా ఉండాలో తెలుసా ?.. డైరెక్టర్ పూరీ చెప్పిన లైఫ్ మోటివేషన్ ఇదే..
డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలకు, ఆయన చెప్పే డైలాగ్స్, మాటలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అయితే ఇప్పుడు తన మాటలను, తన ఆలోచనలను పూరి మ్యూజింగ్స్ అంటూ యూట్యూబ్ లో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా కష్టాలు వస్తే బాధన గుండెల్లో దాచుకుని, ఎటువంటి ఫిర్యాదులు చేయకుండా ముందుకు సాగాలని చెప్పారు. ప్రతీ అవమానం, గాయం వీరిని మరింత బలవంతులుగా మారుస్తుందని ఈ ముసింగ్స్ ద్వారా తెలుస్తుంది.

దర్శకుడు పురి జగన్నాథ్, తన “పూరి మ్యూసింగ్స్” ద్వారా తన అనుభవాలు, ఆలోచనలను ప్రేక్షకులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే స్ట్రాంగ్ పీపుల్స్ ఎలా ఉంటారు.. ? జీవితంలో వచ్చే కష్టాన్ని ఎలా ఎదుర్కొంటారు అనే విషయాలను ఓ వీడియోలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది. “బలమైన వ్యక్తులు” ఎలా ఉంటారు, వారు జీవిత సవాళ్ళను ఎలా ఎదుర్కొంటారనే విషయాలపై పూరి తన ఆలోచనలు పంచుకున్నారు. ఆయన మాటల్లో, సాధారణ వ్యక్తులకు, నిజమైన బలం కలిగిన వ్యక్తులకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. బలమైన వ్యక్తులను దగ్గరగా గమనిస్తే, వారి నుండి అనేక విషయాలు నేర్చుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. “బలమైన వ్యక్తులు ఎప్పుడైనా బాధపడినా లేదా వారికి అన్యాయం జరిగినా, గట్టిగా ఏడవరు. అన్యాయం జరిగిందని అరవరు, ఎవరితోనూ అనవసరమైన యుద్ధానికి దిగరు. తమకు జరిగిన విషయాలకు ఎవరికీ ఎలాంటి వివరణ ఇవ్వరు, ఫిర్యాదు చేయరు, లేదా అనవసరమైన డ్రామాను సృష్టించరు. ఇతరుల సానుభూతి కోసం లేదా అటెన్షన్ కోసం ఎదురు చూడరు. వారి హృదయంలో ఎవరి పట్ల ఎలాంటి కోపం, ద్వేషం పెట్టుకోరు, ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన అస్సలు ఉండదు. వారికి జరిగిన అన్యాయాన్ని, అవమానాన్ని లేదా బాధను గుండెల్లో పెట్టుకొని నిశ్శబ్దంగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు.
కొంతకాలం పాటు అందరికీ దూరంగా, ఏకాంతంగా బతుకుతారు. ఈ దశలో, ఇదివరకు మనుషుల మీద ఉన్న నమ్మకం సన్నగిల్లుతుంది, పాత సంబంధాలపై ఆసక్తి ఉండదు. వ్యవస్థ మీద, సమాజం మీద అసహ్యం వేయొచ్చు, రిలేషన్స్ మీద విరక్తి కలుగుతుంది. అయినప్పటికీ, వారు అందరితో నవ్వుతూ మాట్లాడతారు, అందరి పట్ల దయతో ఉంటారు. తమ లోపల ఉన్న కష్టాన్ని ఎవరితోనూ పంచుకోకుండా, అందరితో ఎప్పటిలాగే సరదాగా, మామూలుగా ఉంటారు. ఇది వారి అంతర్గత బలానికి ప్రతీక. బలమైన వ్యక్తులు తమకు ఎవరో అన్యాయం చేశారు కదా అని, ఇంకొకరికి అన్యాయం చేయరు. దుర్మార్గుడిని గెలిచినంత మాత్రాన వారు దుర్మార్గంగా మారిపోరు. ఎప్పటిలాగే చిరునవ్వుతో, నార్మల్ గా ఉంటారు. కాకపోతే, ఈ అనుభవాల తర్వాత వారు ఇంతకు ముందుకంటే మరింత జాగ్రత్తగా, ఎంపిక చేసుకునే స్వభావంతో ఉంటారు. పనికిరాని పనుల కోసం, అనవసరమైన మనుషుల కోసం తమ శక్తిని వృథా చేయరు. ఇకపై ఏం చేసినా ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటారు. మళ్ళీ ప్రేమించడానికి లేదా కొత్త స్నేహాన్ని పెంచుకోవడానికి వందసార్లు ఆలోచిస్తారు. ఇది వారి అనుభవాల నుండి నేర్చుకున్న విజ్ఞతను తెలియజేస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు.
“అందుకే జీవితంలో ఏం జరిగినా మన మంచికే, ఎన్నో నేర్చుకుంటాం” అని పురి జగన్నాథ్ అన్నారు. ఎప్పుడు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, “బలవంతులుగా ఉండండి” (BE STRONG) అనే సందేశాన్నిచ్చారు. లోపల అన్ని బాధలను దాచుకుని మౌనంగా ముందుకు సాగండి. “ఒక మాట కూడా చెప్పకుండా వెళ్లిపోండి” (Walk away without a word). నలుగురిలో నలిగిన ప్రతిసారీ వెళ్లి ఒంటరిగా కూర్చోండి, అప్పుడే గాయాలన్నీ నయమవుతాయి. “ప్రతి గాయం తర్వాత, మీరు మరింత బలవంతులు అవుతారు” (After every stabbing, you become stronger). ఈ మ్యూసింగ్స్ ద్వారా, కష్టాలు మనల్ని బలహీనపరచడానికి కాదని, మరింత దృఢంగా, విజ్ఞతతో జీవించడానికి ఉపయోగపడతాయని పురి జగన్నాథ్ స్పష్టం చేశారు.
ఎక్కువమంది చదివినవి : Krishna Vamsi: ఆ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టాడు.. కానీ నాకు ఆ మూవీ నాకు నచ్చలేదు.. కృష్ణవంశీ..
