భారత్‌లో త్వరలో బుల్లెట్ రైళ్లు.. ఈ ప్రత్యేకతలు తెలుసా..?
Venkatrao Lella
Images: Pinterest
09 OCT 2026
కేంద్ర ప్రభుత్వం ఏడు కొత్త బుల్లెట్ రైలు కారిడార్లను ప్రకటించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా వివిధ నగరాలకు హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కనెక్టివిటీ కల్పించేలా ప్రణాళికలు రూపొందించింది.
భారత్ తొలిసారిగా సొంత బుల్లెట్ రైళ్లను స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ది చేస్తోంది. మేకిన్ ఇండియా లక్ష్యాన్ని నిజం చేస్తూ తయారీ రంగంలో బల్లెట్ ట్రైన్ల వల్ల ఒక పెద్ద ముందడుగు వేస్తోంది.
ఢిల్లీ-వారణాసి: ఈ బుల్లెట్ రైల్ కారిడార్ జాతీయ రాజధాని ఢిల్లీని తూర్పు ఉత్తరప్రదేశ్‌తో కలుపుతుంది. దీనివల్ల ప్రయాణ సమయం సుమారు 3 గంటల 50 నిమిషాలకు తగ్గనుంది.
ముంబై-పుణె కారిడార్: పశ్చిమ ప్రాంతంలోని ఈ ప్రధాన కారిడార్ రెండు ముఖ్యమైన నగరాలను కలపనుంది. దీనివల్ల ప్రయాణ సమయం కేవలం 48 నిమిషాలకు తగ్గుతుంది. మెరుగైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది.
పుణె-హైదరాబాద్: ఈ కారిడార్ మహారాష్ట్ర, తెలంగాణ మధ్య కనెక్టివిటీని అందించనుంది. ఈ నగరాల మధ్య సుమారు 1 గంట 55 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ప్రయాణీకులకు వేగవంతమైన, మరింత నమ్మకమైన కనెక్టివిటీ లభించనుంది.
హైదరాబాద్-బెంగళూరు: దక్షిణ భారతదేశంలోని రెండు ప్రధాన నగరాలను ఈ కారిడార్ అనుసంధానం చేయనుంది. ప్రయాణ సమయాన్ని సుమారు 2 గంటలకు తగ్గించనుంది. కర్ణాటక, తెలంగాణలోని ప్రధాన ఐటీ, తయారీ, సేవా కేంద్రాల మధ్య రాకపోకలను మెరుగుపరుస్తుంది.
హైదరాబాద్-చెన్నై: బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి వస్తే.. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణానికి సుమారు 2 గంటల 55 నిమిషాలు పడుతుంది. ఈ కారిడార్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అంతటా వ్యాపార కార్యకలాపాల అభివృద్దికి తోడ్పాటు అందించనుంది.
చెన్నై-బెంగళూరు: ఈ కారిడార్ ప్రయాణ సమయాన్ని సుమారు 1 గంట 13 నిమిషాలకు తగ్గించనుంది. దక్షిణ భారతదేశంలో ప్రధాన నగరాలు, వాటి చుట్టుపక్కల ప్రాంతాల మధ్య అనుసంధానాన్ని మెరుగుపర్చనుంది.
వారణాసి-సిలిగురి: ఈ బుల్లెట్ రైలు కారిడార్ పాట్నా మీదుగా వారణాసి, సిలిగురి మధ్య కనెక్టివిటీని అందించనుంది. ప్రయాణానికి సుమారు 2 గంటల 55 నిమిషాలు పడుతుందని అంచనా.