
శబరిగిరి శరణుఘోషతో మారుమోగుతోంది! అయ్యప్ప స్వామి భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఆ అద్భుత ఘట్టానికి సమయం ఆసన్నమైంది. మకర సంక్రాంతి వేళ శబరిమల గిరుల్లో సాక్షాత్తు మణికంఠుడే ‘మకర జ్యోతి’గా దర్శనమిచ్చే పవిత్ర సమయం దగ్గరపడింది. అయితే, ఈసారి మకరవిలక్కు ఉత్సవాలకు వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేరళ హైకోర్టు ఆదేశాలతో దర్శన కోటాపై ఆంక్షలు విధిస్తూనే.. పక్కా భద్రతా ఏర్పాట్లు చేశారు. అసలు దర్శన సమయాలు ఎలా ఉన్నాయి? రాకపోకలపై ఉన్న ఆంక్షలేంటి?
మకరజ్యోతిని చూశాకే అయ్యప్ప దీక్ష విరమణ
శబరిమలలో సంక్రాంతి రోజున ‘మకర జ్యోతి’ని వీక్షించటానికి వేలాది భక్తులు పోటెత్తుతారు. సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామియే తన భక్తులను ఆశీర్వదించడానికి మకర జ్యోతిగా దర్శనమిస్తాడని భక్తుల విశ్వాసం. సంక్రాంతి రోజున సాయంత్రం కనిపించే మకరజ్యోతిని చూశాకే అయ్యప్ప మాలధారులు దీక్ష విరమిస్తారు. ఈ అపురూప ఘట్టాన్ని కళ్లారా చూసేందుకు వేలాదిగా తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. రద్దీని నియంత్రించేందుకు దర్శన కోటాను అధికారులు క్రమబద్ధీకరించారు.
ఈ నెల 13న వర్చువల్ క్యూ ద్వారా 35,000 మందికి, స్పాట్ బుకింగ్ ద్వారా 5,000 మందికి అవకాశం కల్పించనున్నారు. అత్యంత కీలకమైన మకరజ్యోతి దర్శనం రోజున అంటే జనవరి 14న, రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన కోటాను 30 వేలకు పరిమితం చేశారు. ఇక 15 నుంచి 18 వరకు ప్రతిరోజూ 50,000 మందికి వర్చువల్ క్యూ ద్వారా, 5,000 మందికి స్పాట్ బుకింగ్ ద్వారా అనుమతి కల్పించారు. జనవరి 19న తిరిగి భక్తుల సంఖ్యను 30వేలకు తగ్గిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఇవాళ పందళం నుంచి ప్రారంభమయ్యే తిరువాభరణ ఊరేగింపు 14న సన్నిధానానికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో 14న ఉదయం 10 గంటల నుండి నిలక్కల్-పంబ మార్గంలో భక్తుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. వాహనాల పార్కింగ్ విషయంలో కూడా స్పష్టమైన నిబంధనలు విధించారు. ఈ నెల 15 వరకు హిల్ టాప్ దగ్గర ప్రైవేట్ వాహనాల పార్కింగ్‌ను నిషేధించారు. ఎరుమేలి అటవీ మార్గంలో కూడా రేపు సాయంత్రం రాకపోకలపై ఆంక్షలు విధించారు.
పోలీస్ విభాగం భారీ క్రౌడ్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ను రూపొందించగా, ఆర్‌ఏఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ తదితర కేంద్ర బలగాల మద్దతుతో అదనపు సిబ్బందిని మోహరించారు. భక్తుల రవాణా కోసం సుమారు వెయ్యి కేఎస్‌ఆర్‌టీసీ బస్సులను అందుబాటులో ఉంచారు. భక్తులు అధికారుల సూచనలు పాటిస్తూ ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని కోరుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.