AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: బిర్యానీ బిల్లులతో రూ.70వేల కోట్ల స్కామ్.. ఎలా చేశారో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

హైదరాబాద్ బిర్యానీ అంటే దేశవ్యాప్తంగా క్రేజ్.. కానీ అదే బిర్యానీల వెనుక అక్షరాలా రూ.70,000 కోట్ల భారీ స్కామ్ దాగి ఉందని ఎవరైనా ఊహించారా..? మీరు రెస్టారెంట్‌లో బిల్లు కట్టి ముక్క తింటుంటే.. ఆ బిల్లును సిస్టమ్ నుండి మాయం చేస్తూ హోటల్ యజమానులు ప్రభుత్వానికే పంగనామం పెడుతున్నారు. హైదరాబాద్‌లో మొదలైన చిన్న తనిఖీ, ఇప్పుడు దేశవ్యాప్తంగా రెస్టారెంట్ రంగాన్ని కుదిపేస్తోంది.

Hyderabad: బిర్యానీ బిల్లులతో రూ.70వేల కోట్ల స్కామ్.. ఎలా చేశారో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
How Hyderabad Biryani Restaurants Evaded Paying Tax
Prabhakar M
| Edited By: |

Updated on: Feb 20, 2026 | 10:57 AM

Share

బిర్యానీ నగరంగా ఫేమస్ అయిన హైదరాబాద్‌లో ప్రారంభమైన చిన్న స్థాయి తనిఖీలు దేశవ్యాప్తంగా రెస్టారెంట్ రంగాన్ని కుదిపేసే భారీ జీఎస్టీ ఎగవేతను బయటపెట్టాయి. హోటళ్ల బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ దుర్వినియోగంతో వేల కోట్ల రూపాయల పన్ను ప్రభుత్వ ఖజానాకు చేరలేదని దర్యాప్తులో తేలింది. హోటళ్లలో వసూలు చేసిన జీఎస్టీ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించకుండా సిస్టమ్‌లో అమ్మకాల లెక్కలను మార్చడం, బిల్లులను డిలీట్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున మోసం సాగినట్లు అధికారులు గుర్తించారు. వినియోగదారుల నుంచి పన్నుతో కూడిన మొత్తం తీసుకుని, అధికారిక రికార్డుల్లో తక్కువ ఆదాయాన్ని చూపినట్లు విచారణలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా సుమారు 1.77 లక్షల రెస్టారెంట్లకు చెందిన 60 టెరాబైట్ల డేటాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా విశ్లేషించగా, ఆశ్చర్యకరమైన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఒకే తరహా బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌ను వాడుతూ అమ్మకాలలో గణనీయమైన భాగాన్ని రికార్డుల్లో చూపకుండా దాచినట్లు తేలింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే సుమారు రూ.5,100 కోట్ల విలువైన అమ్మకాలు అధికారిక లెక్కల్లో లేకపోవడం గుర్తించారు. దేశవ్యాప్తంగా మాయం చేసిన బిల్లుల విలువ రూ.13 వేల కోట్లు దాటినట్లు ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి. మొత్తం స్కామ్ పరిమాణం రూ.70 వేల కోట్లకు చేరిందని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లో రోజుకు లక్షల్లో బిర్యానీలు అమ్ముడవుతున్నా, ఆ అమ్మకాలలో పెద్ద భాగం పన్ను రికార్డుల్లో కనిపించడంలేదు. నగదు చెల్లింపుల బిల్లులను సిస్టమ్ నుంచి తొలగించడం, కొన్ని రోజుల వ్యాపారాన్ని పూర్తిగా డిలీట్ చేయడం వంటి పద్ధతులు అనుసరించినట్లు దర్యాప్తులో తేలింది. జీఎస్టీ రిటర్నులు దాఖలు చేసే సమయంలో వాస్తవ ఆదాయంలో కేవలం ఒక భాగాన్ని మాత్రమే చూపించి, మిగిలిన మొత్తాన్ని బ్లాక్ మనీగా మలిచినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఎగవేతలో కొన్ని సాఫ్ట్‌వేర్ సంస్థల పాత్రపై కూడా ఆధారాలు లభించాయి.

కేవలం 40 హోటళ్లపై చేసిన భౌతిక తనిఖీల్లోనే సుమారు రూ.400 కోట్ల లెక్కల్లో లేని అమ్మకాలు బయటపడటం ఈ మోసం తీవ్రతను స్పష్టం చేసింది. ప్రస్తుతం దర్యాప్తు దేశవ్యాప్తంగా విస్తరించగా, మొత్తం పరిమాణం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. బిర్యానీ హాండీల వెనుక దాగిన ఈ భారీ పన్ను ఎగవేత ఇప్పుడు రెస్టారెంట్ రంగానికి పెద్ద షాక్‌గా మారింది.

Follow Us