Railway Protection Force: రైల్వే ఆస్తులను సంరక్షించడంతోపాటు ప్రయాణికుల భద్రత.. రక్షణకు అత్యధిక ప్రాధాన్యం కల్పించడంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అలుపెరగని పోరాటం చేస్తోందని.. దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెడుతూ రాష్ట్ర పోలీస్, ఇతర సంస్థలతో సమన్వయం చేసుకుంటూ.. ఆర్‌పీఎఫ్ 2022లో మెరుగైన పనితీరును ప్రదర్శించిందని తెలిపింది. ప్రయాణికుల అవసరాల దృష్ట్యా సర్వీసులను పెంచడంతోపాటు పలు రకాల చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ప్రయాణికులకు, సంస్థకు ఆర్‌పీఎఫ్ అందిస్తున్న సేవలు, ఏడాదికి సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే (SCR) ఆదివారం ప్రకటన విడుదల చేసింది.
‘‘మిషన్ జీవన్ రక్ష’’ క్రింద ఆర్‌పీఎఫ్ సిబ్బంది తమ జీవితాలను పణంగా పెడుతూ మార్చి 2022లో 21 మందిని (13 మంది పురుషులు 8 మంది మహిళలు) రక్షించినట్లు ప్రకటనలో తెలిపింది.
‘‘ఆపరేషన్ నాన్హే ఫరిస్తే’’ కింద దక్షిణ మధ్య రైల్వే రక్షక దళం వివిధ కారణాల వల్ల వారి కుటుంబం నుంచి తప్పిపోయిన/విడిపోయిన పిల్లలను గుర్తించి కాపాడినట్లు పేర్కొంది. మొత్తం 93 మంది (66 మంది బాలురు, 27 మంది బాలికలు) చిన్నారులను రక్షించినట్లు పేర్కొంది.
‘‘ఆపరేషన్ అమానత్’’ కింద ఆర్‌పిఎఫ్ సిబ్బంది ప్రయాణికులకు చెందిన వస్తువులను గుర్తించి వాటిని సరైన యజమానులకు అందజేసింది. రూ.42 లక్షలకు పైగా విలువగలిగిన 192కు పైగా వస్తువులను స్వాధీనం చేసుకొని ప్రయాణికులకు ఆర్‌పీఎఫ్ సిబ్బంది అందజేసినట్లు పేర్కొంది.
రైల్వే ద్వారా మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడానికి ఆర్‌పీఎఫ్ ‘‘ఆపరేషన్ నార్కోస్’’ ప్రారంభించింది. ఇందులో భాగంగా మార్చి 2022లో ఆర్‌పీఎఫ్ రూ.7.50 లక్షలకు పైగా విలువగల మాదకద్రవ్యాల ఉత్పత్తులను జప్తు చేసి, ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసింది.
‘‘ఆపరేషన్ డిగ్నిటీ’’ కింద భద్రత, రక్షణ అవసరమైన నిరాశ్రయులను, నిస్సహాయులను, మానసిక స్థితి సరిగ్గా లేనివారిని ఆర్‌పిఎఫ్ గుర్తించి వారి వారి కుటంబాలకు అప్పచెప్పింది. దీంతోపాటు కొందరిని ఎన్‌జీఓల సహకారంతో వారిని షెల్టర్ హోమ్‌లకు తరలించింది. 2022లో ఐదుగురు పురుషులను, 10 మంది మహిళలను మొత్తం 15 మందిని రక్షించింది.
మార్చి 2022లో ప్రయాణంలో వైద్య సహాయం అవసరమైన మొత్తం 59 మందికి సహాయ సహకారాలు అందించినట్లు పేర్కొంది.
‘‘ఆపరేషన్ సటార్క్’’ కింద మార్చి 2022లో రైళ్లలో అక్రమంగా రవాణా చేస్తున్న రూ.1.97 లక్షల విలువగల మద్యాన్ని స్వాధీనం చేసుకొని ఆరుగురిని అరెస్టు చేసి వారిని ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ వారికి అప్పగించినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది.
Also Read: