Ratan Tata: ఇది రతన్ టాటా అంటే.. మానవత్వానికి కేరాఫ్.. తాజ్ హోటల్‌పై ఉగ్రదాడి తర్వాత..
తన సాదాసీదా స్వభావం,ఉల్లాసమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు రతన్ టాటా. విద్య, ఆరోగ్య సంరక్షణ, గ్రామీణాభివృద్ధి, విపత్తు నివారణలో ఆయన చేసిన కృషీ మరువలేనిది.
ప్రముఖ భారతీయ వ్యాపార దిగ్గజం, మానవతావాది టాటా రతన్ బుధవారం రాత్రి (9, అక్టోబర్) ముంబైలోని ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. తన సాదాసీదా స్వభావం,ఉల్లాసమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు రతన్ టాటా. విద్య, ఆరోగ్య సంరక్షణ, గ్రామీణాభివృద్ధి, విపత్తు నివారణలో ఆయన చేసిన కృషీ మరువలేనిది. ముంబైలో 26/11 ఉగ్రవాద దాడిలో, పాకిస్థాన్ టెర్రరిస్టులు హోటల్ తాజ్‌ను లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడ్డారు. ఈ ఘటనపై రతన్ టాటా తరువాత ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు వెల్లడించారు.
2008, నవంబర్ 26వ తేదీన 10 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు సముద్రం ద్వారా దక్షిణ ముంబైలోకి ప్రవేశించారు. తాజ్ హోటల్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌తో సహా ముంబై నగరంలోని అనేక ముఖ్యమైన ప్రదేశాలపై దాడి చేసి, అల్లకల్లోలం సృష్టించారు. ఆ సమయంలో రతన్ టాటా వయస్సు 70 సంవత్సరాలు. కాల్పులు జరిగిన సమయంలో తాజ్ హోటల్‌లోని కోలాబా చివర నిలబడి కనిపించారు. 60 గంటల తాజ్ ఆపరేషన్‌లో భాగంగా.. హోటల్ బయటే నిల్చుని భద్రతా దళాలకు భరోసా కల్పించారు. హోటల్‌లో చిక్కుకున్న ప్రతి ఒక్కరి బాధ్యత నాదే అని.. వారి యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత నాదే అంటూ ప్రకటించారు రతన్ టాటా.
ఈ ఘటనను కళ్లారా చూసి చలించిపోయారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో, రతన్ టాటా మాట్లాడుతూ, ఎవరో తనకు ఫోన్ చేసి, హోటల్ లోపల కాల్పులు జరుగుతున్నాయని తెలియజేశారని, ఆ తర్వాత తాను తాజ్ హోటక్ సిబ్బందికి ఫోన్ చేశానని, అయితే తన కాల్ ఎవరూ స్వీకరించలేదని చెప్పారు. దీంతో స్వయంగా హోటల్‌కు చేరుకున్నానని తెలిపారు. ఆ తర్వాత తాను కారు తీసి తాజ్ హోటల్‌కు వెళ్లానని, అయితే లోపల కాల్పులు జరుగుతున్నందున లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నానని రతన్ టాటా చెప్పారు. ఆ ఇంటర్వ్యూలో రతన్ టాటా మాట్లాడుతూ.. “ఒక్క ఉగ్రవాదిని కూడా ప్రాణాలతో విడిచిపెట్టకూడదని, అవసరమైతే మొత్తం ఆస్తులను పేల్చివేయండి” అంటూ భద్రతా సిబ్బందికి చెప్పినట్లు రతన్ టాటా వెల్లడించారు.
ఇదిలావుంటే, పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులు ముంబైలో 26/11 దాడికి పాల్పడ్డారు. ఇందులో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడి తర్వాత తాజ్ హోటల్‌ను తిరిగి తెరుచుకుంది. ఈ దాడిలో మరణించిన, గాయపడిన వారి కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోవడం కోసం రతన్ టాటా తన వంతు సాయం అందించారు. ఉగ్రదాడిలో మరణించిన తాజ్ ఉద్యోగి జీవిత కాలం ఎంత అయితే సంపాదిస్తాడో.. అంత మొత్తాన్ని వారి కుటుంబసభ్యులు అందించారు. అంతేకాదు చనిపోయినవారి ఇంటికి స్వయంగా వెళ్లి ఓదార్చారు. ఇక ఈ ఘటనలో గాయపడ్డ ఉద్యోగులు పూర్తిగా కోలుకుని మళ్లీ విధులకు హాజరయ్యే వరకు పూర్తి జీతంతోపాటు.. అదనంగా మరో 50 శాతాన్ని కూడా చెల్లించారు రతన్ టాటా. రతన్ టాటా తన ఉద్యోగులను ఆదుకున్న తీరు.. మానవత్వానికే మచ్చుతునక మాత్రమే ఈ ఘటన.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..