Rakesh Tikait: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు మూడునెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో పెద్దఎత్తున ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైతు సంఘాల నాయకులు, కేంద్ర ప్రభుత్వం మధ్య పలుమార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. జనవరి 26న ఢిల్లీలో జరిగిన అల్లర్ల అనంతరం రైతు సంఘాలు, కేంద్రం మధ్య చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. ఈ తరుణంలో భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ ప్రతినిధి రాకేశ్ తికాయత్.. కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తమ మొరను ఆలకించనంత వరకు ఈ ఉద్యమం ఇలానే కొనసాగుతుందని తికాయత్ స్పష్టంచేశారు. ప్రస్తుతం ప్రభుత్వంతో మాట్లాడటానికి ఎలాంటి అవకాశాలు లేవని పేర్కొన్నారు. అయితే ఉద్యమానికి సన్నాహాలు మాత్రం చాలా జరుగుతున్నాయంటూ రాకేశ్ తికాయత్ వివరించారు. ఇదిలాఉంటే.. ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం నిర్వహిస్తున్న రైతులకు మద్ధతుగా పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. వేసవి కాలం దృష్ట్యా సరిహద్దుల్లో రైతు సంఘాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. సోలార్ ప్యానెళ్లను, జనరేటర్లను ఏర్పాటు చేశారు.
గత మూడు నెలలనుంచి దేశవ్యాప్తంగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని ఆందోళన జరుగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి, రైతు సంఘాలకు మధ్య ఇప్పటివరకు 12 సార్లు చర్చలు జరిగాయి. చివరిసారిగా జనవరి 22న చర్చలు జరిగాయి. అయితే ఈ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తుండగా.. సవరణలు మాత్రమే చేస్తామంటూ కేంద్రం పేర్కొంటోంది.
కాగా.. వ్యవసాయ చట్టాలను ఏడాదిన్నర కాలం పాటు నిలుపుదల చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను రైతు సంఘాలు అంగీకరిస్తేనే మళ్లీ చర్చలు నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పట్లో చర్చలు జరిగేలా కనిపించడం లేదు.
Also Read: