ఖలిస్తానీ గ్రూప్ ఎస్‌ఎఫ్‌జేపై చర్యలు తీసుకోవాలి.. అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్‌తో రాజ్‌నాథ్ సింగ్

|

Mar 17, 2025 | 8:16 PM

US Director of National Intelligence: ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంచి మిత్రులని తులసీ గబ్బర్డ్‌ పేర్కొన్నారు. భారత్‌-అమెరికా సంబంధాలు ఎంతో పురాతనమైనవని, వాటిని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ఖలిస్తానీ గ్రూప్ ఎస్‌ఎఫ్‌జేపై చర్యలు తీసుకోవాలి.. అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్‌తో రాజ్‌నాథ్ సింగ్
Follow us on

రైసినా డైలాగ్‌లో పాల్గొనేందుకు అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బర్డ్ ఢిల్లీ వచ్చారు. ఈ సందర్భంగా సోమవారం ఆమె రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు. తులసి గబ్బర్డ్‌తో జరిగిన సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్ నిషేధిత ఖలిస్తానీ సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్ (SFJ) భారతదేశ వ్యతిరేక కార్యకలాపాల అంశాన్ని లేవనెత్తారు. ఉగ్రవాద సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. భారత్‌లో రెండు రోజుల పర్యటనకు ఢిల్లీకి వచ్చిన తులసీ..  గ్లోబల్‌ ఇంటెలిజెన్స్‌ కాంక్లేవ్‌లో కూడా పాల్గొన్నారు.

ఈ సమావేశంలో రక్షణ మంత్రి పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌తో SFJ సంబంధాల గురించి చర్చించారు. వేర్పాటువాద కార్యకలాపాలను ప్రోత్సహించడంలో ఆ సంస్థ పాత్ర గురించి గబ్బర్డ్‌కు తెలియజేశారు.

అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోవిడత కార్యవర్గంలోని సీనియర్‌ స్థాయి అధికారి భారత్‌ను సందర్శించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో భాగంగా ఆమె ఇప్పటికే జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌తో భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య నిఘా సమాచార పంపిణీ, సాంకేతిక పరిజ్ఞాన సహకారాన్ని పెంపొందించుకోవడం, భారత్‌-అమెరికాల ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యానికి అనుగుణంగా భద్రత రంగంలో బంధాన్ని బలోపేతం చేసుకోవడంపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఇండో-పసిఫిక్‌, ఖలిస్థానీ ఉగ్రవాదం వంటి అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వారు రెండు దేశాల మధ్య రక్షణ సహకారం, నిఘా భాగస్వామ్యం కీలక అంశాలపై చర్చించారు. గురుపత్వంత్ సింగ్ పన్నున్ నేతృత్వంలోని SFJ ‌‌పై కఠిన చర్యలు తీసుకోవాలని రాజ్‌నాథ్ కోరినట్లు తెలిసింది. జాతీయ భద్రతకు ముప్పు కలిగించే సంస్థలను కఠినంగా అణచివేయాలని అమెరికాతో సహా ప్రపంచ భాగస్వాములను భారత్ కోరుతోంది.

మోదీ, ట్రంప్‌ మంచి మిత్రులు:

ఇదిలా ఉండగా, ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంచి మిత్రులని తులసీ గబ్బర్డ్‌ పేర్కొన్నారు. భారత్‌-అమెరికా సంబంధాలు ఎంతో పురాతనమైనవని, వాటిని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఇరుదేశాలు పరస్పర ప్రయోజనాలను గుర్తిస్తున్నాయని, శాంతి, సుసంపన్నత, స్వేచ్ఛ, భద్రత వంటి అంశాలు కేంద్రంగా ఇవి ఉన్నాయన్నారు. ఇక ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాన్ని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చాలా స్పష్టమైన వైఖరితో చూస్తున్నారని, ఆయన దృష్టి మొత్తం శాంతిస్థాపనపైనే ఉందని ఆమె అన్నారు.

 


న్యూఢిల్లీలో అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసీ గబ్బర్డ్‌ని కలిసినందుకు సంతోషంగా ఉందని మంత్రి రాజ్‌నాథ్‌ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. భారతదేశం-అమెరికా భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకునే లక్ష్యంతో.. రక్షణ, సమాచార భాగస్వామ్యం వంటి విస్తృత శ్రేణి అంశాలపై చర్చించామన్నారు.

 


మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి