అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజస్థాన్ సర్కార్ వినూత్న నిర్ణయం తీసుకుంది. అఫర్డబుల్ హౌసింగ్ స్కీమ్ కింద రాష్ట్రంలోని ప్రజలకు కేవలం 300 రూపాయలకే ప్రభుత్వ నివాస గృహాలను అద్దెకు ఇవ్వాలని అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానించింది. కావాలంటే 10 సంవత్సరాల తర్వాత దాని ప్రస్తుత ధరలో మిగిలిన మొత్తాన్ని చెల్లించి ఇంటిని సొంతం చేసుకునేలా అద్దె ఒప్పందాన్ని డ్రాఫ్ట్ చేయనుంది అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వం. ‘రూ. 3 లక్షల కంటే తక్కువ వార్షికాదాయం ఉన్న కుటుంబాలు ఈ అఫర్డబుల్ హౌసింగ్ పథకానికి అర్హులు. అందుబాటు ధరలో గృహనిర్మాణ పథకం కింద నిర్మించిన అనేక ఇళ్లు సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని రాజస్థాన్‌లోని బలహీన వర్గాలకు సేవ చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ ప్రణాళిక’ అని ఆ రాష్ట్ర అర్బన్ అండ్ హౌసింగ్ (UHD) డిపార్ట్‌మెంట్ సీనియర్ అధికారి తెలిపారు.
రాజస్థాన్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో 7 వేలకు పైగా బిల్డిగ్స్(గ్రౌండ్ ఫ్లోర్ + మూడు అంతస్తులు)లలో 1 BHK గదులు ఖాళీగా ఉన్నాయి. మరో 7 నగరాల్లో 14 వేల గదులు కూడా ఖాళీగా ఉన్నాయి. ఇంకా అజ్మీర్, అల్వార్ జిల్లాల్లో భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్న బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ‘రోడ్లు, విద్యుత్, నీరు వంటి ప్రాథమిక సౌకర్యాలను పట్టణ పౌర సంస్థలు ఆయా ప్రాంతాలలో అందుబాటులో ఉంచాయి. అయితే మెయింటనెన్స్ కోసం నీరు, విద్యుత్ బిల్లులను అద్దెకు ఉంటున్నవారే భరించాలి. అంతేకాక ఈ గదులు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన కేటాయించబడతాయ’ని పేర్కొంటూ రాజస్థాన్ ప్రభుత్వం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది.
ఈ పథకంలో అనేక అదనపు ప్రయోజనాలు ఉన్నాయని, 10 సంవత్సరాల పాటు అద్దెకు ఉన్నవారు ఆ తర్వాత ప్రస్తుత ధరలో మిగిలిన మొత్తాన్ని చెల్లించి ఫ్లాట్‌ను కొనుగొలు చేయవచ్చని అధికారులు తెలిపారు. ‘అద్దెకు ఇవ్వనున్న ఫ్లాట్‌ల ప్రస్తుత ధర రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఉన్నాయి. 10 సంవత్సరాలకు రూ. 300 చొప్పున చెల్లించిన అద్దె రూ. 36 వేలు అవుతుంది. కాబట్టి మిగిలిన మొత్తాన్ని చెల్లించి ఫ్టాట్‌లను సొంతం చేసుకొవచ్చ’ని వారు తెలియజేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..