
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల్ని చూశానంటూ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్‌గాంధీ. అంతేకాదు.. తన ఫోన్‌ని కూడా ట్యాప్ చేశారని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని వ్యాఖ్యానించారు. ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ప్రసంగించిన ఆయన.. ఈ కామెంట్స్ చేశారు.
లండన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్శిటీలో ‘21వ శతాబ్దంలో లెర్నింగ్ టు లిజన్’ అనే అంశంపై ప్రసంగించారు రాహుల్‌గాంధీ. ఫోన్ ట్యాపింగ్ నుంచి జోడో యాత్ర వరకు పలు అంశాలపై మాట్లాడారు. దేశంలో పెద్దసంఖ్యలో రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ మోదీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారాయన. ఆ జాబితాలో తాను కూడా ఉన్నట్టు చెప్పారు. ఇంటెలిజెన్స్ అధికారులు తనకు కాల్ చేశారని.. సంభాషణలు రికార్డ్ చేస్తున్నట్టు చెప్పారని స్పీచ్ ఇచ్చారు. భారత ప్రజాస్వామ్య ప్రాథమిక నిర్మాణంపై దాడి జరుగుతోందని కామెంట్ చేశారు రాహుల్‌గాంధీ.
దేశ ప్రజలందరినీ ఏకతాటిపైకి తేవాలనే లక్ష్యంతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు తాను పాదయాత్ర చేశానన్నారు. కశ్మీర్‌లో ఉగ్రవాదుల్ని చూశానంటూ సంచలన విషయాలు బయటపెట్టారు. ఉగ్రదాడులు జరిగే ముప్పు ఉందని భద్రతా సిబ్బంది చెప్పినా తాను ముందడుగే వేశానన్నారు. గుర్తు తెలియని వ్యక్తి తన దగ్గరకు వచ్చి.. నిజంగానే కశ్మీర్ ప్రజల కష్టాలు తెలుసుకోవాలని అకుంటున్నారా? అని ప్రశ్నించారట. తర్వాత కొంతసేపటికి.. దూరంగా ఉన్న కొందర్ని చూపించి ‘వాళ్లంతా ఉగ్రవాదులు’ అని చెప్పినట్టు గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను సమస్యల్లో పడినట్టు అనిపించిందని.. టెర్రరిస్టులు చంపేసేవారే.. కానీ అలా చేయలేదు. ప్రజా సమస్యలు వినడానికి-లిజనింగ్‌కు ఉన్న శక్తి అదేనంటూ రాహుల్ చెప్పుకొచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..