PM Modi – Quad Summit 2022: జపాన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన బిజీబిజీగా కొనసాగింది. టోక్యోలో క్వాడ్ దేశాధినేతల సదస్సులో పాల్గొన్న మోడీ అమెరికా అధ్యక్షుడు బైడెన్, జపాన్ ప్రధాని కిషిదా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనితో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. వరుస సమావేశాల అనంతరం మోడీ ఢిల్లీకి చేరుకున్నారు. ఈ క్వాడ్ సమావేశంలో కరోనా పరిస్థితులు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, చైనాతో పొంచి ఉన్న ముప్పుతో పాటు క్వాడ్ సభ్యదేశాల మధ్య సంబంధాల బలోపేతంపై ప్రధానంగా చర్చించారు. స్వేచ్ఛాయిత ఇండో పసిఫిక్ నిర్మాణం కోసం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు ప్రధాని మోదీ ఈ సదస్సులో స్పష్టం చేశారు. దీంతోపాటు ఆయా దేశాధినేతలతో ప్రధాని మోడీ వేర్వేరుగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
రెండోరోజు పర్యటనలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ప్రధాని మోదీ.. ప్రపంచ శాంతి, స్థిరత్వం, సుస్థిరత కోసం, మానవాభివృద్ధి కోసం భారత్-అమెరికా బంధం మరింత బలపడుతుందని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. అమెరికా-భారత్ బంధం అత్యంత శక్తివంతమైనదని బైడెన్ చెప్పారు. ఆ తర్వాత జపాన్ ప్రధాని కిషిదాతో కూడా సమావేశమయ్యారు మోదీ.. ఇరు దేశాల మధ్య ఉన్న చిరకాల మైత్రిని మరింత పటిష్టం చేసుకోవాలని ప్రధాని మోడీ కోరారు. జపాన్‌కు చెందిన 30పైగా దిగ్గజ వ్యాపార సంస్థల టాప్ ఎగ్జిక్యూటివ్‌లు, సీఈఓలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ప్రధాని. భారత్‌లో పెట్టుబడి అవకాశాలను వారికి వివరించారు మోదీ. ఆ తర్వాత ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఎన్నో దశాబ్దాల నుంచి జపాన్‌లో ఉంటున్న భారతీయులు తమ సంస్కృతిని జాగ్రత్తగా కాపాడుతున్నారని ప్రశంసించారు.
కాగా.. ఈ ఏడాది శిఖరాగ్ర సమావేశానికి వేదికైన జపాన్‌లోని క్వాడ్ సభ్యులతో పలు దఫాలు ఫలవంతమైన ఉన్నత స్థాయి సమావేశాల అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ… భారతదేశానికి పయనమైనట్లు మోడీ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ ట్విట్ చేశారు. ఫలవంతమైన పర్యటన తర్వాత జపాన్ నుండి బయలుదేరాను.. అందులో నేను వివిధ ద్వైపాక్షిక, బహుపాక్షిక కార్యక్రమాలకు హాజరయ్యాను. క్వాడ్ ప్రపంచ ప్రయోజనాల కోసం మరింత శక్తివంతమైన వేదికగా ఉద్భవించినందుకు ఆనందంగా ఉంది. అలాగే క్వాడ్ నాయకులందరితో అద్భుతమైన ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించాను. వ్యాపారం, ఆర్థిక పరమైన అంశాలపై చర్చలు జరిపాను. ఆప్యాయంగా ఆతిథ్యం ఇచ్చినందుకు జపాన్ ప్రభుత్వానికి, ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.. అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..