Sarabjit Singh’s wife Sukhpreet Kaur Death: పాకిస్థాన్ లాహోర్ జైలులో 2013లో హత్యకు గురైన సరబ్‌జిత్ సింగ్ భార్య సుఖ్‌ప్రీత్ కౌర్ సోమవారం రోడ్డు ప్రమాదంలో మరణించారు. సుఖ్‌ప్రీత్ కౌర్ ఆదివారం (సెప్టెంబర్ 11) జలంధర్‌కు వెళ్తుండగా మోటార్‌సైకిల్‌పై నుంచి కిందపడ్డారు. తీవ్ర గాయాలైన ఆమె చికిత్స పొందుతూ సోమవారం మరణించినట్లు సరబ్‌జిత్ సింగ్ కుమార్తె స్వపన్‌దీప్ కౌర్ వెల్లడించారు. ఈ ఘటన భిఖివింద్‌లో చోటుచేసుకుంది. ఆమె అంత్యక్రియలు మంగళవారం స్వస్థలమైన తరన్ తరణ్‌లోని భిఖివింద్‌లో పూర్తయ్యాయి. సుఖ్‌ప్రీత్‌కు ఇద్దరు కుమార్తెలు పూనమ్, స్వపందీప్ కౌర్ ఉన్నారు.
పంజాబ్‌లోని భిఖివింద్ పట్టణానికి చెందిన సరబ్‌జిత్ సింగ్ (49) అనే రైతు భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో నివసించేవారు. మద్యం మత్తులో పొరపాటున సరిహద్దు దాటారు. ఆ సమయంలో అతన్ని పట్టుకున్న పాక్ సైన్యం.. జైలుకు తరలించి విచారించారు. అయితే 1991లో పాకిస్థాన్ కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. సింగ్ లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో 22 సంవత్సరాలు గడిపారు. 2013లో జైలులో సింగ్‌పై తోటి ఖైదీలు దాడిచేశారు. తీవ్రగాయాలైన అతన్ని ఆసుపత్రికి తరలించారు. బలమైన గాయాలు కావడంతో ఐదు రోజుల పాటు కోమాలో ఉన్న సింగ్.. లాహోర్‌లోని జిన్నా ఆసుపత్రిలో మరణించారు.
పాక్ జైలులో ఉన్న సరబ్‌జిత్ విడుదల కోసం.. ఆమె సోదరి దల్బీర్ కౌర్ 22 ఏళ్ల పాటు పోరాడారు. తన సోదరుడు సింగ్ నిర్దోషి అని, పొరపాటున పాకిస్తాన్‌లోకి వెళ్లిపోయాడని, దీంతో అరెస్టు చేశారని దల్బీర్ కౌర్ గోడు వెళ్లబోసుకుంది. ఈ క్రమంలో తన సోదరుడిని చూసేందుకు పాకిస్థాన్ కూడా వెళ్లింది.
సరబ్‌జిత్ సింగ్ మరణం అనంతరం.. విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) సింగ్ మృతిపై దర్యాప్తు జరపాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరింది, అయితే అతని సోదరి దల్బీర్ కౌర్ కూడా కేసుపై విచారణకు పిలుపునిచ్చారు. దాడిని ప్రభుత్వమే ప్లాన్ చేసి ఉంటే.. విచారణ అవసరం లేదు. కానీ అధికారులకు తెలియకుండా సరబ్‌జిత్‌పై దాడి జరిగితే కచ్చితంగా విచారించాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా, సరబ్‌జిత్ సోదరి దల్బీర్ కౌర్ ఛాతీ నొప్పితో గత జూన్‌లో కన్నుమూశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి