కల్తీ మద్యం కలకలం.. 14 మంది మృతి, మరో 15 మంది పరిస్థితి విషమం..!
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో కల్తీ మద్యం సేవించి 14 మంది మరణించగా, మరో 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన భుల్లార్, తంగ్రా మరియు సంధా గ్రామాల్లో జరిగింది. ఇటుక బట్టీల్లో పనిచేసే చాలా మంది కార్మికులు కల్తీ మద్యం సేవించి అస్వస్థతకు గురైనట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడితో సహా ఐదుగురిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు.

పంజాబ్‌లోని అమృతసర్ జిల్లాలో తీవ్ర విషాదం వెలుగులోకి వచ్చింది. కల్తీ మద్యం తాగి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యక్తులందరినీ అమృత్‌సర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అమృత్‌సర్ జిల్లాలోని భుల్లార్, తంగ్రా, సంధా గ్రామాల్లో కల్తీ మద్యం సేవించడం వల్ల మరణాలు సంభవించాయి. మరణించిన వారిలో ఎక్కువ మంది గ్రామాల్లోని ఇటుక బట్టీలలో పనిచేసే కార్మికులే. ఈ సంఘటన తర్వాత చర్యలు తీసుకున్న పంజాబ్ పోలీసులు నకిలీ మద్యం సరఫరా చేసిన ప్రధాన నిందితుడితో సహా ఐదుగురిని అరెస్టు చేశారు.
ఈ ఘటనపై సీఎం భగవంత్ మాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అలాగే ఆయన దోషులను కఠినంగా శిక్షిస్తామని, ఈ ఘటనపై లోతైన విచారణ జరిపించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఉచిత వైద్య సహాయం అందిస్తుందని సీఎం ప్రకటించారు. కల్తీ మద్యం అమ్మకదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పంజాబ్ ప్రభుత్వం నుండి పోలీసులకు కఠిన ఆదేశాలు అందాయి. దీంతో తాజా ఘటనపై 2 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.
కల్తీ మద్యం తాగడం వల్ల ప్రజల ఆరోగ్యం క్షీణించింది. నోటి మాట బంద్ అయ్యింది. స్థానిక ప్రజల ప్రకారం, మరారి కలాన్ గ్రామంలోనే నలుగురు మరణించారు. అమృత్‌సర్ గ్రామీణ ఎస్‌ఎస్‌పి ప్రకారం, ప్రధాన నిందితుడు ప్రభ్‌జీత్ సింగ్ నకిలీ మద్యం సరఫరా చేయడం వెనుక ప్రధాన సూత్రధారి అని, అతన్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. దీంతోపాటు, ప్రధాన నిందితుడి సోదరుడు కుల్బీర్ సింగ్ అలియాస్ జగ్గు, సాహిబ్ సింగ్ అలియాస్ సారాయ్, గుర్జంత్ సింగ్, జీత భార్య నిందర్ కౌర్‌లను కూడా అరెస్టు చేశారు. వారిపై ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ 105 బిఎన్‌ఎస్, 61ఎ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
కల్తీ మద్యం సేవించి మరణించిన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మరారి కలాన్ గ్రామంలోనే ఎక్కువ మరణాలు సంభవించాయి. చాలా మంది ఇప్పటికీ కొనఉపిరితో పోరాడుతున్నారు. ఈ సంఘటన తర్వాత, పంజాబ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నకిలీ మద్యం వ్యాపారంపై దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆదేశాలు జారీ చేశారు. మజిత కేసులో ఇప్పటివరకు 5 మంది నిందితులను అరెస్టు చేశారు.
#WATCH | Punjab: 14 people dead and 6 hospitalised after allegedly consuming spurious liquor in Amritsar's Majitha
SSP Amritsar Maninder Singh says, " We received information around 9:30 pm last night that here people have started dying after consuming spurious liquor. We took… pic.twitter.com/C7miySsHo6
— ANI (@ANI) May 13, 2025
పంజాబ్‌లో కల్తీ మద్యం సేవించి మరణాలు సంభవించడం ఇది మొదటిసారి కాదు, అయితే కల్తీ మద్యం సేవించి ఎందరో ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది మార్చిలో సంగ్రూర్‌లో కల్తీ మద్యం సేవించి దాదాపు 21 మంది మరణించారు. చాలా మంది కంటి చూపును కోల్పోయారు. కాగా, 2020 సంవత్సరంలో తర్న్ తరన్‌లో కల్తీ మద్యం బారిన పడి 50 మందికి పైగా మరణించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..