Puducherry Floor Test on Monday: పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి ప్రభుత్వం ఈ నెల 22న శాసనసభలో బల పరీక్షను ఎదుర్కొనుంది. ఈ మేరకు గవర్నర్ తమిళి సై సౌందర్‌రాజన్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. అధికార పార్టీకి అసెంబ్లీలో తగినంత మెజారిటీ లేదని ప్రతిపక్షాలు ఇప్పటికే గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ తమ ప్రభుత్వ బలం నిరూపించుకోవాలని నారయణస్వామికి సూచించారు. అయితే పుదుచ్చేరిలో త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న క్రమంలోనే నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కాంగ్రెస్-డీఎంకే కూటమి ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఈ క్రమంలో గురువారం ప్రతిపక్ష పార్టీల నేతలు, ముఖ్యమంత్రి నారాయణ స్వామి గవర్నర్‌ను కలిశారు. అనంతరం ప్రతిపక్ష, అధికార పక్షాలకు చెరొక 14 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు గవర్నర్ గుర్తించారు. దీంతో శాసన సభను ఈ నెల 22న సమావేశపరచాలని.. అదే రోజు సాయంత్రం 5గంటలకు నారాయణ స్వామి ప్రభుత్వం బలాన్ని నిరూపించుకోవాలని సూచించారు.
15 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే..
పుదుచ్చేరి శాసన సభలో 33 స్థానాలు ఉన్నాయి. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. మరొక ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడటంతో 28 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలో నారాయణ స్వామి ప్రభుత్వం కొనసాగాలంటే.. కనీసం 15 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రభుత్వానికి మద్దతిచ్చే కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య, స్పీకర్‌ను కలుపుకోని 10 మంది ఉండగా.. డీఎంకే నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ స్వతంత్ర ఎమ్మెల్యే కలుపుకోని మొత్తం 14 మంది మద్దుతు ఉంది. ప్రతిపక్షానికి కూడా 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ప్రభుత్వంపై ప్రతిష్టంభన నెలకొంది. త్వరలో పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. నారాయణ స్వామి ప్రభుత్వం బల పరీక్షలో నెగ్గకపోతే రాష్ట్రపతి పాలన విధించే అవకాశముంది.
Also Read: