ఢిల్లీలోని ఓ రియల్టర్ రూ. 800 కోట్ల బ్యాంకు ఫ్రాడ్ కు పాల్పడడంతో ఈడీ అధికారులు నగరంలోని అతని ఏడు కార్యాలపైనా, ఇళ్ల పైనా ఏకకాలంలో దాడులు జరిపారు. రాజ్ సింగ్ గెహ్లాట్ అనే ఈ రియల్టర్ మీద, ఇతని సంస్థలమీద మనీ లాండరింగ్ కేసుకూడా నమోదైంది. ఇతని ఆధ్వర్యంలోని అమన్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, ఇంకా ఎంబియన్స్ గ్రూప్ వంటి కంపెనీలపై దాడులు జరిగాయి. ఇతని ఇంటి నుంచి రూ. 40 లక్షల విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. గెహ్లాట్ తో బాటు దయానంద సింగ్, మోహన్ సింగ్ గెహ్లాట్ అనే ఇతర డైరెక్టర్ల నివాసాలనూ ఈడీ సిబ్బంది సోదాలు చేశారు. ఓ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మిస్తామంటూ వీరంతా వివిధ బ్యాంకుల నుంచి దాదాపు 800 కోట్ల రూపాయలను రుణంగా తీసుకుని ఆ నిధులను తమ డొల్ల కంపెనీలకు, తమ కుటుంబసభ్యుల ఖాతాలకు మళ్లించారట.
జమ్మూ కాశ్మీర్ అవినీతి నిరోధక శాఖ వీరిపై గత ఏడాదే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది. దేశంలో ఇంకా విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి నకిలీ వ్యక్తులు ఉన్నారని, బ్యాంకులకు ఇలాగే కుచ్ఛు టోపీలు పెడుతున్నారని ఇలాంటివారివల్ల స్పష్టమవుతోంది.