న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. అందువల్ల తాను శుక్రవారం (ఫిబ్రవరి 16) ఉత్తరప్రదేశ్‌లోని చందౌలిలో జరిగే భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనలేకపోతున్నట్లు తన ‘ఎక్స్ (ట్విటర్)’ ఖాతాలో వెల్లడించారు. ‘ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే భారత్ జోడో న్యాయ యాత్ర కోసం ఎంతగానో ఎదురుచూశా. కానీ అనారోగ్యం వల్ల ఈరోజే ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. కోలుకున్న వెంటనే నేనూ యాత్రలో పాల్గొంటా’ అని ఆమె పోస్ట్ ప్రకటించారు.
కాగా మణిపుర్ నుంచి ముంబయి వరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బిహార్ మీదుగా సాగుతున్న ఈ యాత్ర శుక్రవారం రాత్రికి ఉత్తరప్రదేశ్ చేరనుంది. ఉత్తరప్రదేశ్‌లో రాహుల్‌తో పాటు ప్రియాంక కూడా పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ ఇదివరకే ప్రకటించింది. ప్రస్తుతం ఆమె అనారోగ్యానికి గురవడంతో యాత్రలో పాల్గొనలేకపోతున్నట్లు ట్వీట్ చేశారు. బీహార్‌లోని ఔరంగాబాద్‌లో గురువారం జరిగిన మెగా ర్యాలీలో గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగించారు.
मैं बड़े चाव से उत्तर प्रदेश में भारत जोड़ो न्याय यात्रा के पहुँचने का इंतजार कर रही थी, लेकिन बीमारी की वजह से मुझे आज ही अस्पताल में भर्ती होना पड़ा। थोड़ा बेहतर होते ही मैं यात्रा में जुड़ूँगी। तब तक के लिए चंदौली-बनारस पहुंच रहे सभी यात्रियों, पूरी मेहनत से यात्रा की तैयारी…
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 16, 2024
నేటి నుంచి ఫిబ్రవరి 21 వరకు, ఆ తర్వాత 24, 25వ తేదీల్లో రాహుల్ యాత్ర యూపీలో కొనసాగనుంది. ఫిబ్రవరి 22, 23 రోజుల్లో యాత్రకు విరామం ఇస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తూర్పు-పశ్చిమ మణిపూర్-ముంబై యాత్ర 15 రాష్ట్రాల గుండా 6,700 కి.మీ మేర కొనసాగనుంది. యాత్రలో సామాన్య ప్రజలను కలుసుకుంటూ ‘న్యాయ్’ (న్యాయం) సందేశాన్ని హైలైట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇర ప్రియాంక యాత్రలో ఎప్పుడు పాల్గొంటారన్న దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. కాగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని రాయ్‌బరేలీ స్థానం నుంచి ప్రియాంక పోటీ చేస్తారనే ప్రచారం జరుగా సాగుతోంది. ఎన్నో యేళ్లుగా ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. తాజాగా రాజ్యసభ ఎన్నికలకు ఆమె నామినేషన్ వేశారు కూడా. అయితే రాయ్‌బరేలీ నుంచి గాంధీ కుటుంబసభ్యులే పోటీ చేస్తారని సోనియా సూచనప్రాయంగా వెల్లడించారు. దీంతో ఆ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయడం ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.