నానమ్మ ఇందిర లుక్‌లో కనిపించిన ప్రియాంక గాంధీ! ప్రత్యేక కేరళ చీర ధరించి, ఎంపీగా ప్రమాణ స్వీకారం

|

Nov 28, 2024 | 1:04 PM

ప్రియాంక కేరళ కాటన్ జారీ చీర ధరించి కట్టుబొట్టుతో అక్కడి సంస్కృతి ప్రతిభించేలా లోక్‌సభకు హాజరయ్యారు.

నానమ్మ ఇందిర లుక్‌లో కనిపించిన ప్రియాంక గాంధీ! ప్రత్యేక కేరళ చీర ధరించి, ఎంపీగా ప్రమాణ స్వీకారం
Priyanka Gandhi
Follow us on

తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన ప్రియాంక గాంధీ వాద్రా గురువారం(నవంబర్ 28) ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక కుటుంబం అంతా కూడా పార్లమెంటు హౌజ్‌లోనే ఉన్నారు. తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్‌ గాంధీతో పాటు భర్త రాబర్ట్ వాద్రా, ఆమె కుమారుడు రెహాన్ వాద్రా, కుమార్తె మిరాయా వాద్రా కూడా పార్లమెంట్ హౌస్‌లో ఉన్నారు.

కేరళ సాంప్రదాయాన్ని అనుసరించి క్రీమ్ కలర్ చీర కట్టుకున్న ప్రియాంక గాంధీ పార్లమెంటు హౌస్‌కి చేరుకున్నారు. ప్రియాంక కేరళ కాటన్ జారీ చీర ధరించి కట్టుబొట్టుతో అక్కడి సంస్కృతి ప్రతిభించేలా లోక్‌సభకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ఎంపీగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా, ప్రియాంక తన చేతిలో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని, దానిని గాలిలో చూపుతూ.. హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రమాణ స్వీకారం అనంతరం ప్రియాంక లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ముకుళిత హస్తాలతో అభివాదం చేశారు. అనంతరం మొదటి వరుసలో కూర్చున్న ప్రతిపక్ష నేతలకు ప్రియాంక అభివాదం చేశారు. సభలో ప్రతిపక్ష నేత, ఆయన సోదరుడు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ప్రియాంక ప్రతిపక్ష ఎంపీలకు ఉన్న నాలుగో వరుస సీట్లలో కూర్చున్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మొదటి వరుసలో కూర్చున్నారు.

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు భర్త రాబర్ట్ వాద్రాతో పాటు కుమారుడు రెహాన్, కుమార్తె మిరయా వాద్రా కూడా పార్లమెంట్ హౌస్‌కు చేరుకున్నారు. ప్రియాంక తన తల్లి సోనియా గాంధీతో కలిసి పార్లమెంట్ హౌస్‌కు వచ్చారు. తల్లి సోనియా గాంధీ, రాబర్ట్ వాద్రా, రాబర్ట్ తల్లి, ఇద్దరు పిల్లలు, మల్లికార్జున్ ఖర్గే, రంజిత్ రంజన్ సహా పలువురు కాంగ్రెస్ ఎంపీలు కూడా ఎంపీ గ్యాలరీలో కూర్చున్నారు.

అంతకుముందు ప్రియాంక లోక్‌సభలోకి అడుగుపెట్టగానే కాంగ్రెస్ ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు. ఆమెను చుట్టుముట్టి ఫొటోలు, సెల్ఫీలు దిగారు. కాగా, మిసా భారతి, దీపేందర్ హుడా, శశిథరూర్ సహా పలువురు ఎంపీలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, నితిన్‌ గడ్కరీలకు అభివాదం చేసిన ప్రియాంక, గ్యాలరీలో కూర్చున్న సోనియా గాంధీని, ఆమె అత్తగారిని కూడా పలకరించారు.

ప్రియాంక గాంధీ తొలిసారి పత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. గత వారం ముగిసిన కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో ఎన్నికయ్యారు. వాయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో నాలుగు లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు.

దేశ చరిత్రలో గాంధీ-నెహ్రూ కుటుంబానికి చెందిన ముగ్గురు పార్లమెంటులో కనిపించడం ఇదే తొలిసారి. ప్రియాంక గాంధీ తోపాటు ఆమె సోదరుడు రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉండగా, ఆమె తల్లి సోనియా గాంధీ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ప్రియాంక తొలిసారిగా చట్టసభలో సభ్యురాలయ్యారు. ప్రియాంక గాంధీ ఐదు సంవత్సరాల క్రితం 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆమె ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అప్పటి నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. తాజాగా రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ ఏర్పడ్డ వయనాడ్ స్థానంలో పోటీ చేసి గెలుపొందారు.

ఇదిలాఉండగా, ప్రియాంకతో పాటు మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికైన కాంగ్రెస్ నేత రవీంద్ర బసంత్రావ్ చవాన్ కూడా ఈరోజు పార్లమెంటు సభ్యులుగా ప్రమాణం చేశారు. చవాన్ మరాఠీ భాషలో ప్రమాణం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..