Presidential Election 2022: ఈ సమయం చాలా కీలకం.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన ప్రధాని మోదీ..
PM Modi : కొత్త రాష్ట్రపతి, కొత్త ఉపరాష్ట్రపతి దేశానికి మార్గనిర్దేశం చేయడం ప్రారంభించే ఈ ప్రస్తుత ప్రక్రియ ఎంతో కీలకమైందన్నారు. ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాలం కూడా అని ప్రధాని గుర్తు చేశారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో (Presidential election 2022) అతి కీలకమైన పోలింగ్ ప్రక్రియ సోమవారం ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Session) కూడా ఇవాళే ప్రారంభం కావడంతో ఎంపీలందరూ ఢిల్లీలో, ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేలు అసెంబ్లీల్లో ఓట్లు వేస్తున్నారు. పార్లమెంట్ భవనంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానితోపాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు క్యూలైన్లలో నిలబడి ఓట్లు వేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయడానికి ముందు.. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. కొత్త రాష్ట్రపతి, కొత్త ఉపరాష్ట్రపతి దేశానికి మార్గనిర్దేశం చేయడం ప్రారంభించే ఈ ప్రస్తుత ప్రక్రియ ఎంతో కీలకమైందన్నారు. ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాలం కూడా అని ప్రధాని గుర్తు చేశారు.
ప్రతి ఒక్కరి పార్లమెంటులో ఉత్తమ నిర్ణయాలు తీసుకుంటారని, ఈ సమావేశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని పార్లమెంటు సభ్యులను ప్రధాని మోడీ కోరారు. “ఈ సెషన్ కూడా ముఖ్యమైనది. ఎందుకంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ కాలంలో, కొత్త రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి దేశానికి మార్గనిర్దేశం చేయడం ప్రారంభిస్తారు” అని ఆయన అన్నారు.
#WATCH Prime Minister Narendra Modi votes to elect new President, in Delhi#PresidentialElection pic.twitter.com/pm9fstL46T
— ANI (@ANI) July 18, 2022
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమవుతాయి. ప్రభుత్వ కార్యకలాపాల అవసరాలకు లోబడి ఆగస్టు 12న ముగుస్తాయి. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కోసం ఎన్నికల సంఘం.. పార్లమెంట్ భవనంలోని రూమ్ 63లో మొత్తం ఆరు బూత్ ను ఏర్పాటు చేసింది. సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్లకు వేర్వేరు విలువ ఉంటుంది కాబట్టి, ఎంపీలకు ఆకుపచ్చ రంగు, ఎమ్మెల్యేలకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలను అందించారు.
మొత్తం 4809 మంది ఎలక్టరోరల్ కాలేజి సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. అందులో 776 మంది ఎంపీలు, 4033 మంది ఎమ్మెల్యేలున్నారు. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా మధ్య పోరు జరుగుతుండగా, ఇప్పటికే ఆయా పార్టీలు ప్రకటించిన మద్దతులను బట్టి ద్రౌపది ముర్ము విజయం ఖాయం.