Presidential Elections 2022: రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరఫు అభ్యర్థి ద్రౌపది ముర్ము స్వయంగా సోనియాగాంధీ, శరద్ పవార్, మమతా బెనర్జీలకు ఫోన్ చేశారు. రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా వారి మద్ధతు కోరారు. శుక్రవారంనాడు రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ఆమె వ్యక్తిగతంగా వారికి ఫోన్ చేసినట్లు తెలిసింది. రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలుస్తున్న ఆమెకు వారు ముగ్గురూ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పినట్లు తెలిసింది.
ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో శుక్రవారం ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కారీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, జైరాం ఠాగూర్, ఫుస్కర్ సింగ్ ధమి, ఎన్డీయే కూటమికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్ధతు ప్రకటించిన వైసీపీ, బీజూ జనతా దళ్(BJD), అన్నా డీఎంకే తరఫు ప్రతినిధులు పాల్గొన్నారు. వైసీపీ తరఫున ఆ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత విజయసాయి రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరయ్యారు.
విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యస్వంత్ సిన్హా పేరును ఇప్పటికే ఖరారు చేశారు. యస్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విపక్ష నేతలకు రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో యస్వంత్ సిన్హాకు మద్ధతు ఇస్తున్న మరికొందరు విపక్ష నేతలకు కూడా ద్రౌపది ముర్ము ఫోన్ చేసి తన అభ్యర్థిత్వానికి మద్ధతు కోరినట్లు తెలిసింది. ద్రౌపది ముర్ము విపక్ష నేతలకు ఫోన్ చేసి మద్ధతు కోరడం ద్వారా.. రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ఆమె చివరి ప్రయత్నం చేసినట్లయ్యింది. అయితే దీనిపై విపక్షాలు సానుకూలంగా స్పందించి రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేస్తాయా? లేక ఇది వరకే నిర్ణయించిన మేరకు యస్వంత్ సిన్హాను బరిలో నిలుపుతాయా? అన్న అంశం ఆసక్తికరంగా మారింది.
రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైతే జులై 18న ఓటింగ్ జరగనుంది. జులై 21న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..