Pneumonia: కోవిడ్-19 నాటి సీన్లు రిపీట్.. మళ్లీ మాస్క్ తప్పనిసరి అవుతుందా? ఆరు రాష్ట్రాలకు హై అలర్ట్!

చైనా న్యుమోనియా ప్రభావం భారత్‌ను కూడా తాకేసింది. రాజస్థాన్, కర్నాటక, గుజరాత్, ఉత్తరాఖండ్, హర్యానా, తమిళనాడు ఈ ఆరు రాష్ట్రాల్లో న్యుమోనియా కేసులు ఎక్కువగా నమోదవడంతో హై అలర్ట్ జారీ చేసింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసి నివేదికలు తెప్పించుకుంది కేంద్ర ప్రభుత్వం.

Pneumonia: కోవిడ్-19 నాటి సీన్లు రిపీట్.. మళ్లీ మాస్క్ తప్పనిసరి అవుతుందా? ఆరు రాష్ట్రాలకు హై అలర్ట్!
Pneumonia

Updated on: Nov 29, 2023 | 6:14 PM

చవకైన ఫోన్లు, పటాసులు, ప్లాస్టిక్ సామాన్లు, ఎలక్ట్రిక్ సైకిళ్ళే కాదు.. వైరస్‌లూ, ఇన్ఫెక్షన్లకు కూడా కేరాఫ్‌గా మారింది చైనా దేశం. అక్కడి చిన్నారుల్ని వేధిస్తున్న శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు.. ఇండియాను సైతం వణికిస్తున్నాయి. అసలే సీజనల్ వ్యాధులతో అల్లాడిపోతున్న జనం, ఇప్పుడీ న్యుమోనియా భయంతో మరింత కునారిల్లిపోతున్నారు. ప్రస్తుతానికి దేశంలో పావు భాగం పాపులేషన్‌, ఈ కొత్త ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా అప్రమత్తమైంది.

డ్రాగన్ కంట్రీ చైనా కొన్నాళ్లుగా న్యుమోనియాతో బాధపడుతోంది. ముఖ్యంగా అక్కడి చిన్నారి లోకం ఊపిరి తీసుకోడానికి కష్టపడుతోంది. ఈ కేసుల్లో కొత్త వైరస్‌ ఏదీ లేకపోయినా, న్యుమోనియా వ్యాధిగ్రస్థులతో అక్కడి ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. చైనా న్యుమోనియా ప్రభావం భారత్‌ను కూడా తాకేసింది. రాజస్థాన్, కర్నాటక, గుజరాత్, ఉత్తరాఖండ్, హర్యానా, తమిళనాడు ఈ ఆరు రాష్ట్రాల్లో న్యుమోనియా కేసులు ఎక్కువగా నమోదవడంతో హై అలర్ట్ జారీ చేసింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసి నివేదికలు తెప్పించుకుంది కేంద్ర ప్రభుత్వం.

ఇప్పుడొచ్చే సీజనల్ ఫ్లూ చాలా డేంజర్ అంటూ అప్రమత్తం అయ్యింది కర్నాటక ప్రభుత్వం. రద్దీ ప్రదేశాల్లో మాస్క్‌ని తప్పనిసరి చేస్తూ అడ్వైజరీ జారీ చేసింది. కానీ, అంత ఆందోళన అవసరం లేదనేది రాజస్థాన్ వైద్య ఆరోగ్యశాఖ చెబుతున్న మాట. ఇన్ఫెక్షన్ వ్యాప్తి పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిందేనని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.

చైనాతో సరిహద్దుల్ని పంచుకుంటున్న ఉత్తరాఖండ్ అయితే, తమ రాష్ట్రంలోని మూడు జిల్లాలపై ప్రత్యేక నిఘా పెట్టింది. అసాధారణ కేసులు నమోదైతే వెంటనే హెల్త్ మినిస్ట్రీ హెడ్‌ క్వార్టర్స్‌కి రిపోర్ట్ చేయాలని ఆదేశాలిచ్చింది. ప్రస్తుతానికి తుమ్ము, దగ్గు వచ్చినప్పుడు నోటిని, ముక్కును మూసిపెట్టడం, తరచూ చేతుల్ని శుభ్రం చేసుకోవడం బెటర్ అంటున్నారు వైద్య నిపుణులు.

తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాలు కూడా న్యుమోనియా వార్తలతో అలర్ట్ అయ్యాయి. ఆస్పత్రి పడకల్ని రిజర్వు చేయించి, పీపీఈ, టెస్ట్‌ కిట్ల సరఫరాపై దృష్టి పెట్టాయి ఆయా రాష్ట్రాల్లో ఆరోగ్యశాఖలు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…