ముంబైలో రూ. 4,355 కోట్ల భారీ స్కామ్ కు తెర తీసిన పీఎంసీ బ్యాంక్ ఫ్రాడ్ కేసులో 9 మంది అరెస్టయ్యారు. ఈ మోసానికి సంబంధించి బీజేపీ నేత సర్దార్ తారాసింగ్ కొడుకు రాజ్ నీత్ సింగ్ ను ఆర్ధిక నేరాల విచారణా విభాగం శనివారం అరెస్టు చేసింది. ఈ కేసు నమోదైన వెంటనే రాజ్ నీత్ సింగ్ బ్యాంక్ ఫ్రాడ్ గురించి ఎవరితోనో మాట్లాడుతున్న వీడియో వైరల్ అయింది. ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులపై ఆర్ధిక నేరాల విచారణా విభాగం ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. రియల్ ఎస్టేట్ గ్రూపు హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లయిన రాకేష్ వాధ్వాన్, ఆయన కుమారుడు సారంగ్ వాధ్వాన్, ఈ బ్యాంకు మాజీ ఎండీ జాయ్ థామస్, మాజీ డైరెక్టర్ వర్యామ్ సింగ్, డైరెక్టర్లు సుర్జీత్ సింగ్ అరోరా, రంజిత్ సింగ్, ఆడిటర్లు జయేష్ సంఘానీ, కేతన్ లక్డావాలా, అనితా కిర్దత్ ఇదివరకే అరెస్టయ్యారు. వీరిలో ముగ్గురు ఆడిటర్లూ ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారు.
అరెస్టయిన ఈ అధికారులతో కుమ్మక్కై వాధ్వానాలు భారీ ఎత్తున రుణాలు తీసుకుని ఎగవేసిన సంగతి తెలిసిందే. అయితే తమ ఆస్తులను అమ్ముతామని, వాటిని వేలంలో వేసి రుణాలు తీరుస్తామని వారు పేర్కొన్నారు. కాగా-బ్యాంకు దాదాపు దివాలా తీసే స్థితికి చేరుకోవడంతో.. డిపాజిటర్లు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే విత్ డ్రా చేసుకోవాలని రిజర్వ్ బ్యాంకు మొదట పరిమితి విధించింది. అయితే ఆ తరువాత క్రమేపీ దీన్ని 50 వేలకు పెంచింది. హెచ్‌డీఐఎల్‌కు సంబంధించి స్వాధీనం చేసుకున్న ఆస్తులను విడుదల చేసేందుకు అనుమతించాలంటూ ఆర్ధిక నేరాల విచారణా విభాగం ఎస్‌ప్లనేడ్ కోర్టుకు ‘ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ‘ సమర్పించింది.
దీంతో ఆ ఆస్తులను వేలం వేయగలుగుతామని పేర్కొంది. అలాగే వీటిని రిలీజ్ చేసి విక్రయించేందుకు ఈడీ కూడా ఈ విధమైన సర్టిఫికెట్‌ను స్పెషల్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కోర్టుకు సమర్పించే యోచనలో ఉంది. వాధ్వానాలకు చెందిన రెండు విమానాలను, ఒక అధునాతన బోటును, రోల్స్ రాయిస్ కారును, ఇతర ఆస్తులను గతంలోనే స్వాధీనం చేసుకున్నారు.