Mann Ki Baat – Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం 11గంటలకు ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో.. ఈ రోజు మన్ కీ బాత్ కార్యక్రమంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత కొన్ని రోజులుగా యువత ఉపాధి సమస్యను సోషల్ మీడియాలో లేవనెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉద్యోగ, ఉపాధి రంగాలపై ప్రధాని మోదీ ఏవైనా ప్రకటన చేస్తారా.. అనే దానిపై చర్చ నడుస్తోంది. దీంతోపాటు మళ్లీ దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం, అదేవిధంగా పలుచోట్ల లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా మోదీ మాట్లాడతారని సమాచారం. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఆయా ప్రాంతాల్లో బీజేపీ అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో వీటన్నింటిపై ప్రధాని ప్రసంగిస్తారని పేర్కొంటున్నారు.
ఇదిలాఉంటే.. గతనెల జనవరి 31న చివరిసారి జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. జనవరి 26 రిపబ్లిక్ దినోత్సవం రోజున ఎర్రకోటపై జాతీయ పతాకానికి అవమానం జరగడంపై దేశం దిగ్భ్రాంతి చెందిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇలాంటి వాటిని ప్రజలు సహించరంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా చాలా విషయాలను ప్రధాని మోదీ పంచుకున్నారు. హైదరాబాద్‌లోని బోయినపల్లిలోని స్థానిక కూరగాయాల మార్కెట్‌లో కుళ్లిపోయిన కూరగాయల నుంచి 500 యూనిట్ల విద్యుత్ తయారీ, హర్యానాలోని పంచకుల బారౌట్ పంచాయతీలోని మురికి నీటిని శుద్ధి చేస్తున్న తీరు, అరుణాచల్ ప్రదేశ్ మోన్ షుగు కాగితం తయారీ తదితర స్ఫూర్తివంతమైన కథనాలపై ప్రసంగించారు.
గతేడాది చివరి ఎపిసోడ్‌లో భారతదేశం తయారు చేసిన ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోందని, వాటిని అందరూ ఆదరించాలని కోరారు. ‘లోకల్ ఫర్ వోకల్’ నినాదానికి మద్దతు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీసుకురావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.
Also Read: