PM Modi: సీఎం స్టాలిన్‌కు ప్రధాని మోడీ ఫోన్‌.. అన్ని విధాల సహయానికి హామీ!

PM Modi: తమిళనాడులోని ఉత్తర ప్రాంతంలోని విల్లుపురం జిల్లాలో సోమవారం భారీ నుంచి అతిభారీ వర్షాల కారణంగా అపూర్వమైన వరదలు సంభవించాయి. వంతెనలు, రోడ్లు నీటమునిగడంతో పలు..

PM Modi: సీఎం స్టాలిన్‌కు ప్రధాని మోడీ ఫోన్‌.. అన్ని విధాల సహయానికి హామీ!
Follow us
Subhash Goud

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 03, 2024 | 4:58 PM

‘ఫంగల్’ తుఫాను తమిళనాడులో భారీ విధ్వంసం సృష్టించింది. భారీ వర్షాలు, తుఫాను కారణంగా వరదలు రాష్ట్రంలో భారీ నష్టం కలిగించాయి. ఈ బీభత్సంలో చాలా మంది మరణించారు. రాష్ట్రంలో సంభవించిన విపత్తు, అక్కడి పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. రాష్ట్రానికి అన్ని విధాలా సాయం చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

మంగళవారం ముఖ్యమంత్రి స్టాలిన్‌తో ప్రధాని మోదీ మాట్లాడారని, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వరదల పరిస్థితిపై సమాచారం అందుకున్నారని ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక వర్గాలు తెలిపాయి. స్టాలిన్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

ఫెంగల్ తుఫాను భారీ విధ్వంసం:

తమిళనాడులోని ఉత్తర ప్రాంతంలోని విల్లుపురం జిల్లాలో సోమవారం భారీ నుంచి అతిభారీ వర్షాల కారణంగా అపూర్వమైన వరదలు సంభవించాయి. వంతెనలు, రోడ్లు నీటమునిగడంతో పలు గ్రామాలు, నివాస కాలనీలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల్లో వేసిన పంటలు కూడా నీట మునిగాయి. ఇదిలా ఉండగా, తిరువణ్ణామలైలో డిసెంబర్ 1 రాత్రి కురిసిన వర్షాల సమయంలో బురద జారడం, కొండపై నుండి పడిన రాయి కారణంగా ఐదు మృతి చెందారు.

అంతకుముందు సోమవారం ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ, ఫెంగల్ తుఫాను రాష్ట్రంలో భారీ విధ్వంసం సృష్టించిందని అన్నారు. 2,000 కోట్ల మధ్యంతర సాయాన్ని వెంటనే విడుదల చేయాలని ప్రధాని మోదీని కోరారు. దెబ్బతిన్న మౌలిక సదుపాయాలు, జీవనోపాధిని తాత్కాలిక పునరుద్ధరణకు పరిపాలన ద్వారా ఈ మొత్తాన్ని ఉపయోగిస్తామని ఆయన చెప్పారు.

ఫెంగల్ తుఫాను గత నెల నవంబర్ 23న అల్పపీడనంగా ఏర్పడి దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులోని 14 జిల్లాల్లో భారీ విధ్వంసం సృష్టించింది. తొలుత తిరువారూరు, తంజావూరు, మైలాడుతురై, నాగపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయని ప్రధాని మోదీకి రాసిన లేఖలో సీఎం స్టాలిన్ తెలిపారు.

దీంతో పాటు రాజధాని చెన్నై, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు, కాంచీపురం, విల్లుపురం తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆ తర్వాత డిసెంబర్ 1న ఈ ప్రాంతాల్లో తుపాను తాకడంతో కడలూరు, కళ్లకురిచ్చి, విల్లుపురం, తిరువణ్ణామలైలో రోడ్లు, విద్యుత్ లైన్లకు భారీ నష్టం వాటిల్లింది. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పలుచోట్ల నేలకొరిగాయి. దీంతో పాటు అంతర్భాగంలోని ధర్మపురి, రాణిపేట, కృష్ణగిరి, వేలూరు, తిరుపత్తూరు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు, వరదల వల్ల భారీ నష్టం వాటిల్లింది.

లక్షల కుటుంబాలు విపత్తుల బారిన..

ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా దాదాపు 69 లక్షల కుటుంబాలు, 1.5 కోట్ల మంది ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. సిఎం స్టాలిన్ ప్రకారం, తిరువణ్ణామలై, విల్లుపురం, కళ్లకురిచి జిల్లాల్లో ఒక్క రోజులో మొత్తం సీజన్ సగటు (50 సెం.మీ కంటే ఎక్కువ) కు సమానమైన వర్షపాతం నమోదైంది. దీని కారణంగా ఇక్కడ వరదలు వంటి పరిస్థితి ఏర్పడింది. మౌలిక సదుపాయాలు, పంటలకు భారీ నష్టం జరిగింది.

ఈ జిల్లాల్లో సహాయ, సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు సీనియర్ మంత్రులు, అధికారులను నియమించగా, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) 9 బృందాలు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డిఆర్‌ఎఫ్) 9 బృందాలను మోహరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నష్టాలను ప్రాథమికంగా అంచనా వేసినప్పుడు తాత్కాలిక పునరుద్ధరణ ప్రయత్నాలకు దాదాపు రూ.2,475 కోట్లు అవసరమని తేలిందని సీఎం చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి