PM Narendra Modi on human rights: రాజకీయ లాభాలు, నష్టాలను బేరీజు వేసుకొని మానవ హక్కుల గురించి మాట్లాడటం ప్రజాస్వామ్యానికి హానికరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మానవ హక్కుల పేరుతో కొందరు వ్యక్తులు దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. లబ్ధి చేకూరుతుందన్న విషయాల్లోనే మానవ హక్కులు గుర్తుకువస్తాయని.. ఆ తర్వాత గుర్తుకు రావంటూ ప్రధాని తెలిపారు. 28వ జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్ఆర్‌సీ) వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పలు కీలక అంశాల గురించి ప్రస్తావించారు. కొంతమంది మానవ హక్కుల పేరుతో దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని అలాంటి వారిపట్ల మనమంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. రాజకీయ రంగుతో మానవ హక్కులను చూడకూడదని.. అది ప్రజా స్వామ్యానికి హానికరమంటూ పునరుధ్ఘాటించారు.
ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా ముస్లిం మహిళలు కొన్ని దశాబ్ధాలుగా చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేస్తున్నారని ప్రధాని గుర్తుచేశారు. అలాంటి వారందరికీ.. ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తెచ్చి వారికి కొత్త హక్కుల్ని కల్పించామని, హజ్ సమయంలో మహ్రమ్ (మగ తోడు) నిబంధన నుంచి విముక్తి కల్పించినట్లు ప్రధాని తెలిపారు. పది కోట్ల మంది మహిళలకు మరుగుదొడ్డు ఏర్పాటు చేశామని తెలిపారు. 4 కోట్ల ఇళ్లకు విద్యుత్తు సరఫరా కల్పించామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉద్యోగం చేస్తున్న గర్భిణి మహిళలకు 26 వారాల మెటర్నిటీ లీవ్‌ను కల్పిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. మహిళల రక్షణ కోసం 700 జిల్లాల్లో వన్‌స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. దీంతోపాటు 650 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశామన్నారు. అత్యాచారం లాంటి హేయమైన నేరాలకు కఠిన శిక్షలు విధిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
సబ్‌కా సాత్ – సబ్‌కా వికాస్ – సబ్‌కా ప్రయాస్ లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరి మానవ హక్కుల్ని రక్షించే విధంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఏదైనా పథకం ప్రవేశపెడితే.. దాని ద్వారా కొందరికే లబ్ధి చేకూరుతుందని హక్కుల అంశం బయటకు వస్తుందంటూ మోదీ అన్నారు. అందుకే అందరికీ సంక్షేమ పథకాలు అందేలా ముందుకు సాగుతున్నామన్నారు. మన రాజ్యాంగం సమానత్వ అంశంపై ప్రపంచానికి కొత్త నిర్వచనాన్ని నేర్పిందన్నారు. గత కొన్ని దశాబ్ధాలుగా కొన్ని దేశాలు తమ రాజ్యాంగ లక్ష్యాల నుంచి దారిమళ్లాయని, కానీ భారత్ మాత్రం రాజ్యాంగ సూత్రాలకు కట్టుబడి ఉన్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
హక్కులు, విధుల అంశాలపై అవగాహన కల్పించాలని, ఈ రెండింటినీ వేరువేరుగా చూడకూడదంటూ మోదీ అభిప్రాయపడ్డారు. హక్కులతోపాటు.. విధుల పట్ల కూడా ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని మోదీ సూచించారు. కొన్ని ఘటనల్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లు భావిస్తారని, కానీ అలాంటి ఇతర ఘటనల్లో మాత్రం వాళ్ల అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయన్నారు. రాజకీయ కోణంలో చూస్తేనే మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లు అవుతుందని, ప్రజాస్వామ్యానికి ఇది హానికరమని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా పాల్గొన్నారు.
Also Read: