PM Narendra Modi: తన రెండు రోజుల గుజరాత్ పర్యటనలో చివరి రోజున ప్రధాని నరేంద్ర మోడీ గాంధీనగర్‌లోని తన తల్లి హీరాబెన్ మోడీ నివాసానికి చేరుకున్నారు. ప్రధాని మోడీ తల్లి నేడు 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. తన తల్లి హీరాబెన్ తో కలిసి పూజలు చేసిన మోడీ.. అనంతరం తన తల్లికి పాదపూజ చేశారు.. తల్లి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రసుత్తం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అంతేకాదు ప్రధాని మోడీ తన తల్లి పుట్టినరోజు సందర్భంగా పావగడ ఆలయంలో కాళికా మాతను పూజించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ధ్వజారోహణం కూడా చేయనున్నారు. 500 ఏళ్ల తర్వాత ఈ ఆలయంపై ధ్వజారోహణం జరుగుతుందని చెబుతున్నారు. పావగఢ్ దేవాలయం పర్వతం మీద ఉంది. ఇక్కడికి చేరుకోవాలంటే రోప్‌వే సహాయం తీసుకోవాలి.అనంతరం 250 మెట్లు ఎక్కగానే అమ్మవారి దర్శనం. అయితే పావగడ పర్వతంపై నిర్మించిన హెలిప్యాడ్‌లో ప్రధాని మోదీ నేరుగా హెలికాప్టర్ ద్వారా కొండపైకి చేరుకోనున్నారు. ఇక్కడి అమ్మవారి దర్శనం తర్వాత మళ్లీ వారసత్వ వననంలో పర్యటించనున్నారు. మధ్య గుజరాత్‌లోని ఈ ప్రాంతం ఆదివాసీలకు చెందినది. కనుక ఈ పర్యటన రాజకీయ కోణంలో కూడా సాగుతుందని తెలుస్తోంది.
వడోదరలో బహిరంగ సభలో ప్రసంగించనున్న ప్రధాని మోడీ
మరోవైపు.. గర్భిణీ స్త్రీలు, శిశువులకు పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా గుజరాత్ ప్రభుత్వం రెండు కొత్త పథకాలను తీసుకుని వస్తుంది. ఈ పథకాలను ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ప్రారంభించనున్నారు. దీనితో పాటు వడోదర నగరంలో బహిరంగ సభలో కూడా ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాతృశక్తి యోజన (ఎంఎంవై) , పోషణ్ సుధా యోజనలను కూడా ప్రారంభించనున్నారు. గర్భిణులకు, బాలింతలకు నవజాత శిశువులకు పౌష్టికాహారాన్ని అందించడం MMY పథకం లక్ష్యం.
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi reaches the residence of his mother Heeraben Modi, in Gandhinagar.
PM Modi’s mother will enter the 100th year of her life today. pic.twitter.com/sCVXA9RsSo
— ANI (@ANI) June 18, 2022
రాజకీయ ప్రాధాన్యతతో ప్రధానమంత్రి పర్యటన
ఎనిమిది రోజుల తర్వాత ప్రధాని మోడీ తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటించడం ఇది రెండోసారి. ఈ ఏడాది డిసెంబర్‌లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మోడీ జూన్ 10న రాష్ట్రానికి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఈ టూర్‌కు చాలా ప్రత్యేకత ఉందని భావిస్తున్నారు. పంచమహల్ జిల్లా పావగఢ్‌లోని ‘మహాకాళి అమ్మవారి’ ఆలయాన్ని ప్రధాని మోడీ సందర్శిస్తారని.. ఆపై ‘విరాసత్ వాన్’కు వెళతారని గుజరాత్ విద్యాశాఖ మంత్రి జితు వాఘాని తెలిపారు. ఆ తర్వాత వడోదర నగరంలో జరిగే ‘గుజరాత్ గౌరవ్ అభియాన్’ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా భారతీయ రైల్వేకు చెందిన రూ.16,369 కోట్ల విలువైన 18 ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..