దేశంలో కొత్త తరహా ప్రోత్సాహానికి మోదీ శ్రీకారం చుట్టారు. ఇండియాలోని ప్రముఖ గేమర్లతో కీలక సమావేశం నిర్వహించారు. యువతను దృష్టిలో పెట్టుకుని ఈ వేదకను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నేటి యుగంలో ప్రతి ఒక్కరి అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. ఏదో ఒక సందర్భంలో ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించుకుని గేమ్స్ అడుతున్న వారు ప్రతి 10 మందిలో 7 గురు ఉంటారు. అంటే గేమింగ్ రంగం కూడా ఒక పెద్ద పరిశ్రమలా భావించారు ప్రధాని మోదీ. అందుకే వీరికి సరైన ప్రోత్సాహకాలను అందించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా భారత దేశంలోని ప్రముఖ గేమర్లను గురువారం ప్రధాని మోదీ పీఎంవో కార్యాలయానికి పిలిపించారు. అక్కడ ప్రత్యేకమైన వీఆర్ గేమింగ్ సెటప్ రూపొందించి దాని గురించి పూర్తి అవగాహనను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత హెడ్‌సెట్ ధరించి, చేతిలో జాయ్ స్టిక్స్ పట్టుకుని ప్రముఖ గేమ్‌లు ఆడుతూ కనిపించారు. కొత్త-తరం ఆన్‌లైన్ గేమ్‌లపై సీనియర్ రాజకీయ నాయకుడు ఎంత వేగంగా ఇంత నాలెడ్జ్‌ను పొందగలిగారనే దానిపై గేమర్‌లు తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఆ తరువాత కాసేపు సృజనాత్మకతను ఉపయోగించి ఈ రంగాన్ని ఎలా అభివృద్ది చేయగలము అన్నదానిపై చర్చించారు. అలాగే గేమింగ్ వర్సస్ ఆన్లైన్ గేమింగ్ పై కూడా గేమర్లు ప్రధాని మోదీకి వివరించారు.
అలాగే దీనిపై దేశంలోని యువత స్పందిస్తూ తమపై ఇంతటి అంకితభావాన్ని ఉంచుకున్న ప్రధానిని చూసి ఆనందం వ్యక్తం చేశారు. సమాజం నేడు డిజిటల్ రూపంలో పరుగెడుతున్న సందర్భంగా ఇలాంటి కొత్త ఆవిష్కరణలు తమకు ఎంతో మేలు చేస్తాయని కొందరు గేమర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండియాలో గేమింగ్‌కు పెరుగుతున్న ఆదరణ, ప్రాముఖ్యతకు ఇది నిదర్శనమని చెబుతున్నారు కొందరు ట్రైనీ గేమర్స్. దేశాభివృద్దికి తోర్పడే ప్రతి ఒక్క అంశాన్ని, రంగాన్ని ప్రధాని మోదీ ప్రోత్సహిస్తున్నారంటున్నారు పలువురు నెటిజన్స్. ఈ రంగాన్ని అభివృద్ది చేయడం ద్వారా మహిళలకు, సృజనాత్మకంగా ఆలోచించే వారికి మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలని భావిస్తున్నారు ప్రధాని మోదీ. అలాగే భారతదేశంలో గేమింగ్‌ను కెరీర్‌గా చట్టబద్ధం చేయడంతో పాటు డిజిటల్ స్పేస్‌లో ఉన్న అవరోధాలను అధిగమించడం గురించి చర్చించారు. గతంలో తమ ప్రభుత్వం గేమింగ్ విధానంపై తీసుకొచ్చిన అంశాలను కూడా ప్రస్తావించారు. కేంద్రం ఇలాంటి వాటిని ప్రోత్సహించడం కోసం ముందుంటుందని హామీ ఇచ్చారు ప్రధాని మోదీ. ఇలా క్రియేటివ్ ఆలోచనలు ఉన్న మీతో కలిసి ఆనందంగా గడపడం తనకు మంచి అనుభూతిని ఇచ్చిందన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..