PM Narendra Modi: ఓడిన స్థానాలే ప్రధాని మోదీ టార్గెట్.. అందుకే కల్కిధామ్‌ పర్యటన..

Kalki Mandir Sambhal: రానున్న 100 రోజులు అత్యంత కీలకం.. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయండి అంటూ పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరిచిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాను సైతం అంటూ మర్నాటి నుంచే పర్యటనలు మొదలుపెట్టారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గట్టి పోటీనిచ్చి స్వల్ప తేడాతో ఓడిపోయిన స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని బీజేపీ నేషనల్ కౌన్సిల్ సమావేశాల వేదికపై నుంచి పిలుపునిచ్చిన మోదీ, తన మొదటి పర్యటన కూడా యూపీలో బీజేపీ ఓడిపోయిన ప్రాంతం నుంచే ప్రారంభించారు.

PM Narendra Modi: ఓడిన స్థానాలే ప్రధాని మోదీ టార్గెట్.. అందుకే కల్కిధామ్‌ పర్యటన..
Pm Modi

Edited By: Ravi Kiran

Updated on: Feb 19, 2024 | 1:53 PM

Kalki Mandir Sambhal: రానున్న 100 రోజులు అత్యంత కీలకం.. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయండి అంటూ పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరిచిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాను సైతం అంటూ మర్నాటి నుంచే పర్యటనలు మొదలుపెట్టారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గట్టి పోటీనిచ్చి స్వల్ప తేడాతో ఓడిపోయిన స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని బీజేపీ నేషనల్ కౌన్సిల్ సమావేశాల వేదికపై నుంచి పిలుపునిచ్చిన మోదీ, తన మొదటి పర్యటన కూడా యూపీలో బీజేపీ ఓడిపోయిన ప్రాంతం నుంచే ప్రారంభించారు. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్‌లో చేపట్టిన ఈ పర్యటన ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇందుక్కారణం.. ఆయన ఓ కాంగ్రెస్ నేత ఆహ్వానాన్ని అందుకుని వెళ్లడమే. సంభాల్‌లో కల్కిధామ్ పేరుతో ఓ పెద్ద ఆలయాన్ని నిర్మించాలన్నది కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్. ఇందుకోసం సకల ఏర్పాట్లు చేసుకున్న ఆయన, ఆలయ శంకుస్థాపనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించారు. ప్రధాని సైతం వెంటనే అంగీకరించారు. అంతే వేగంగా కాంగ్రెస్ పార్టీ ఆచార్య ప్రమోద్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. దాంతో కాంగ్రెస్ నేత కాస్తా కాంగ్రెస్ మాజీ నేత, కాంగ్రెస్ బహిష్కృత నేతగా మారిపోయారు. నిజానికి ఆయన కాంగ్రెస్‌లో ఉంటూనే పలుమార్లు ప్రధాని మోదీని ప్రశంసిస్తూ ప్రకటనలు చేశారు. అయోధ్య రామమందిరం గురించి పార్టీ వైఖరికి భిన్నంగా తన సొంత వైఖరి వెల్లడించారు. జనవరి 22న జరిగిన బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆహ్వానం అందుకుని హాజరయ్యారు. కాంగ్రెస్ దిగ్గజ నేతలతో సన్నిహితంగా ఉంటూ ప్రియాంక గాంధీకి రాజకీయ సలహాదారుగా సైతం పనిచేసిన ఆచార్య ప్రమోద్ కృష్ణ ఆహ్వానాన్ని మోదీ అంగీకరించడం వెనుక కారణం కూడా ఉంది. అదేంటంటే..

ఖాతా తెరవని ప్రాంతం

కల్కిధామ్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేస్తున్న ప్రాంతం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్ డివిజన్‌లో ఉంది. 2014కు మించి 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303 స్థానాలు గెలుపొందినప్పటికీ.. కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆ పార్టీ స్కోర్ కాస్త తగ్గింది. బీజేపీని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమవడమే ఇందుక్కారణంగా చెప్పుకోవచ్చు. ఆ ఎన్నికల్లో సమాజ్‌వాదీ (ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) కలసికట్టుగా పోటీ చేశాయి. ఫలితంగా రాష్ట్రంలోని 80 సీట్లలో బీజేపీని 64 సీట్లకు పరిమితం చేయగలిగాయి. కూటమి 15 సీట్లు గెలుచుకోగా, సోనియా గాంధీ ఒక్కరే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఈ కూటమి గెలిచిన 15 సీట్లలో మొరాదాబాద్ రీజియన్ ఒకటి. ఇక్కడున్న 6 సీట్లనూ కూటమి స్వీప్ చేసింది. మొత్తంగా ఈ డివిజన్‌లో కమలదళం ఖాతా కూడా తెరవలేకపోయింది. ఇక్కడ మూడు లోక్‌సభ స్థానాలు సమాజ్‌వాదీ పార్టీ గెలుచుకుంది. మొరాదాబాద్ స్థానం నుంచి డాక్టర్ S.T. హసన్, సంభాల్ నుంచి షఫీకర్ రెహ్మాన్ గెలుపొందారు. రాంపూర్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్ విజయం సాధించారు. కానీ ఆ తర్వాత కోర్టు శిక్షకు గురికావడంతో పదవి కోల్పోయారు. అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం రాంపూర్ స్థానాన్ని బీజేపీ గెలుచుకోగలిగింది. మిగిలిన మూడు లోక్‌సభ స్థానాల్లో బీఎస్పీ అభ్యర్థులు విజయం సాధించారు. అమ్రోహా నుంచి బీఎస్పీకి చెందిన డానిష్ అలీ విజయం గెలుపొందగా.. మాయావతి కొన్ని నెలల క్రితం ఆయన్ను పార్టీ నుంచి తప్పించారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. బిజ్నోర్ లోక్‌సభ స్థానం నుంచి మలుక్ నగర్ ఎంపీగా ఎన్నికయ్యారు. నగర్ ఈసారి ఆర్‌ఎల్‌డీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. అదే జిల్లాలోని నగీనా రిజర్వ్‌డ్ స్థానంలో బీఎస్పీకి చెందిన గిరీష్ చంద్ర జాతవ్ విజయం సాధించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తన నలుగురు సిట్టింగ్ ఎంపీలను బరిలోకి దింపింది. కానీ అందరూ ఓడిపోయారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మొరాదాబాద్‌ డివిజన్‌లోని అన్ని స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఈసారి కూడా అదే రిజల్ట్ పునరావృతం చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.

దేశవ్యాప్తంగా మిషన్ 400 ప్లస్ లక్ష్యంగా నిర్దేశించుకున్న కమలనాథులు యూపీలో మిషన్ మిషన్ 75 ప్లస్‌ అంటూ టార్గెట్ పెట్టుకున్నారు. ఈసారి రాష్ట్రంలో కూడా భిన్నమైన వాతావరణం ఉంది. బలమైన ప్రాంతీయ పార్టీల్లో ఒకటైన మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ విపక్ష కూటమి (I.N.D.I.A)లో లేదు. ఆ కూటమిలో భాగంగా సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలు ఉండగా.. జయంత్ చౌధరి సారథ్యంలోని రాష్ట్రీయ లోక్‌దళ్‌ (RLD)ను ఎన్డీఏ కూటమిలో చేర్చుకునేందుకు కమలనాథులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. చౌధరి చరణ్ సింగ్‌కు భారతరత్న ఇవ్వడం కూడా అందులో భాగమేనని అర్థమవుతోంది. బీఎస్పీ ఒంటరి పోరు కారణంగా విపక్షాల ఓట్లు చీలి బీజేపీ లాభపడే అవకాశాలున్నాయి. మొత్తంగా మొరాదాబాద్ డివిజన్‌లోని అన్ని లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. నేటి ప్రధాని పర్యటన పార్టీ కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..