AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: సిలబస్ దాటి విద్యార్థుల జీవితాల్లోకి వెళ్లండి.. జాతీయ ఉత్తమ టీచర్లతో ప్రధాని మోదీ ఆత్మీయ భేటీ..

టీచర్ గారూ.. మంచి స్పీకర్ కావాలంటే నాకు చిట్కాలు చెప్పండి.. అంటూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ అడిగితే ఆ ఉపాధ్యాయురాలి రియాక్షన్ ఏంటో తెలుసా? ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జాతీయ అవార్డు గ్రహీతలతో మోదీ జరిపిన సమావేశం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓవైపు నవ్వులు పూయిస్తూనే.. మరోవైపు పిల్లల్లో గ్యాడ్జెట్ల వ్యసనం, డ్రగ్స్ ముప్పుపై దేశ ఉపాధ్యాయులకు మోదీ ఇచ్చిన బలమైన సందేశం ఏంటో తెలుసుకుందాం..

PM Modi: సిలబస్ దాటి విద్యార్థుల జీవితాల్లోకి వెళ్లండి.. జాతీయ ఉత్తమ టీచర్లతో ప్రధాని మోదీ ఆత్మీయ భేటీ..
Pm Modi Interacts With National Teachers Award Winners
Krishna S
|

Updated on: Sep 05, 2026 | 10:29 AM

Share

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసం జరిగిన ఈ ఆత్మీయ కలయికలో ప్రధానమంత్రి ఉపాధ్యాయులతో ఎంతో ఉల్లాసంగా ముచ్చటించారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు పోషిస్తున్న పాత్రను కొనియాడటంతో పాటు మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలను ఆయన స్మరించుకున్నారు.

నవ్వులు పూయించిన ముచ్చట్లు

ఈ సమావేశంలో ఉపాధ్యాయులు తమ విద్యాబోధనలోని వినూత్న పద్ధతులను ప్రధానితో పంచుకున్నారు. పిల్లలకు ఇంటర్వ్యూలు చేయడం నేర్పిస్తున్నానని ఒక ఉపాధ్యాయురాలు చెప్పగా.. “అలాగైతే మీ పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులను కూడా వంట ఎందుకు చేశారంటూ ప్రశ్నిస్తున్నారా?” అని మోదీ చమత్కరించడంతో హాలులో నవ్వులు విరిశాయి. అలాగే విద్యార్థులకు పబ్లిక్ స్పీకింగ్ నేర్పించే మరో టీచర్‌తో.. “నేను మీ స్టూడెంట్‌ని అనుకుంటే, మంచి వక్తగా ఎదగడానికి నాకు ఎలాంటి చిట్కాలు ఇస్తారు?” అని ప్రధాని అడిగారు. ఇందుకు ఆ టీచర్ కాస్త తడబడుతూనే.. నిరంతర సాధనతో పాటు మోదీ గారి వ్యక్తిత్వ ప్రభావాన్ని చూసి నేర్చుకోవచ్చని చెప్పడంతో వాతావరణం మరింత సందడిగా మారింది.

గిరిజన బిడ్డలకు భరోసా – ఆరోగ్యంపై చైతన్యం

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల ద్వారా పాఠశాల ముఖం చూడని కుటుంబాల నుంచి వచ్చిన మొదటి తరం పిల్లలు నేడు ఎన్‌ఐటీ, ఐఐటీ స్థాయి కలలను సాకారం చేసుకుంటున్న తీరును ఒక ఉపాధ్యాయుడు వివరించారు. మరోవైపు బ్రెస్ట్ క్యాన్సర్‌పై మహిళల్లో చైతన్యం తెచ్చేందుకు చేపట్టిన పరిశోధనల గురించి ఓ మహిళా టీచర్ ప్రస్తావించగా.. తన నియోజకవర్గమైన కాశీలో భారీ స్థాయిలో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించి గిన్నిస్ రికార్డు నెలకొల్పిన విషయాన్ని మోదీ గుర్తుచేశారు.

సిలబస్ దాటి ఆలోచించండి

నేటి ఆధునిక కాలంలో పిల్లలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య స్క్రీన్ టైమ్ అని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు డిజిటల్ ప్రపంచం నుంచి బయటకు రావాలంటే వారిని మైదానాల్లో ఆడే ఆటల వైపు, సృజనాత్మక కార్యక్రమాల వైపు మళ్లించాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. అలాగే యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిపై ఉపాధ్యాయులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ మార్పులను గమనించాలని సూచించారు. కేవలం సిలబస్, పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాల్లోకి ప్రవేశించి, వారిలో దాగిన ప్రతిభను వెలికితీయాలని, ముఖ్యంగా వారిలో ‘బాల్యం’ చనిపోకుండా కాపాడాల్సిన బాధ్యత గురువులపైనే ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

Follow Us