Allari Naresh: ఆ బాధను ఎప్పటికీ మర్చిపోలేను.. అందుకే ఆ సినిమాను ఇప్పటివరకు మళ్లీ చూడలేదు.. అల్లరి నరేష్ ఎమోషనల్..
అల్లరి నరేష్ తన జీవితంలో ఎదుర్కొన్న వ్యక్తిగత, వృత్తిపరమైన సవాళ్లను పంచుకున్నారు. చిన్ననాటి ఫుట్‌బాల్ గాయం, తండ్రి ఈవీవీ సత్యనారాయణ అనారోగ్యం, ఆయన తుది రోజుల్లో హాస్పిటల్‌కు, షూటింగ్‌కు మధ్య పడిన కష్టాలను వివరించారు. కామెడీ సీన్‌లు చేస్తూనే లోలోపల అనుభవించిన బాధ, కుటుంబానికి అండగా నిలబడాల్సిన బాధ్యతలను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కామెడీ చిత్రాలతో నటుడిగా తనదైన ముద్ర వేసిన ఆయన.. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని అత్యంత వ్యక్తిగత, భావోద్వేగ క్షణాలను వెల్లడించారు. చిన్ననాటి ప్రమాదం నుండి తండ్రి ఈవీవీ సత్యనారాయణ మరణం వరకు ఆయన పడిన కష్టాలు, ప్రొఫెషనల్ బాధ్యతలు, వ్యక్తిగత బాధల మధ్య ఆయన ఎలా సమన్వయం చేసుకున్నారన్నది అందరిని కట్టిపడేస్తుంది. నరేష్ తన చిన్నతనంలో జరిగిన ఒక ఫుట్‌బాల్ ప్రమాదాన్ని గుర్తు చేసుకున్నారు. ఫుట్‌బాల్ ఆడుతుండగా కాలుకు బలమైన దెబ్బ తగిలిందని, అది తీవ్రంగా వాచిందని చెప్పారు. ఎక్స్‌రే తీసినా కారణం తెలియలేదని, కొన్నాళ్లకు అది క్యాన్సర్‌గా అనుమానించబడిందని నరేష్ తెలిపారు. తన తండ్రి ఈవీవీ సత్యనారాయణ తనను అమెరికా తీసుకెళ్లి చికిత్స చేయించగా, అది రక్తపు గడ్డ అని, అది ఎముకను తినేయడం ప్రారంభించిందని వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న నరేష్, ఆ అనుభవం తన కుటుంబానికి ఎంతటి టెన్షన్‌ను ఇచ్చిందో వివరించారు.
ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..
తండ్రి అనారోగ్యం, మరణం: నిశ్చితార్థం నుండి విషాదం వరకు..
తండ్రి ఈవీవీ సత్యనారాయణ ఆరోగ్యం క్షీణించడం తన జీవితంలో అత్యంత కఠినమైన దశ అని నరేష్ పేర్కొన్నారు. తన నిశ్చితార్థం రెండు వారాల్లో ఉందని, ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్న సమయంలో తండ్రి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించిందని చెప్పారు. 2011 జనవరి 17న ఆయన్ను హాస్పిటల్‌లో చేర్చినట్లు తెలిపారు. ఈ సమయంలో తాను షూటింగ్‌లో ఉండాల్సి వచ్చిందని, రోజూ ఉదయం షూటింగ్‌కు వెళ్లే ముందు తండ్రి పక్కన కూర్చుని, బ్రేక్ టైంలో హాస్పిటల్‌కు వెళ్లి, మళ్లీ సాయంత్రం షూటింగ్ అయ్యాక తండ్రి వద్దకే వచ్చానని నరేష్ భావోద్వేగంగా చెప్పారు.
సీమటపాకాయ్ షూటింగ్: నవ్వుతూ నరకం
ఈవీవీ సత్యనారాయణ జనవరి 21న తుదిశ్వాస విడిచిన రోజు నరేష్ ‘సీమటపాకాయ్’ సినిమా పాట చిత్రీకరణలో ఉన్నారని తెలిపారు. ఆ రోజు షూటింగ్ రద్దు చేయమని కోరినా, అమెరికా వెళ్లే ఆర్టిస్టులు ఉండటం, 54 మందికి పైగా కళాకారులు పాల్గొనడం వల్ల అది సాధ్యం కాలేదని చెప్పారు. ఉదయం నుంచి తండ్రి పరిస్థితి సీరియస్‌గా ఉందని ఫోన్‌లు వస్తున్నా, కామెడీ పాటలో నవ్వాల్సి వచ్చిందని నరేష్ వివరించారు. లోపల చనిపోతున్నట్లు అనిపించినా, ప్రేక్షకుల కోసం నవ్వుతూ నటించాల్సి వచ్చిందని, అది తన జీవితంలో అత్యంత కఠినమైన పని అని పేర్కొన్నారు. ఆ సినిమాను తాను నేటికీ చూడలేదని, మళ్లీ చూస్తే ఆ రోజు జ్ఞాపకాలు గుర్తొస్తాయని, ఆ కోపాన్ని ఎవరిపై చూపించాలో తెలియదని నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో తాను మానసికంగా పూర్తిగా కుంగిపోయానని, ఏడుపు కూడా రాలేదని చెప్పారు. తండ్రి మరణానంతరం కుటుంబానికి అండగా నిలబడాల్సిన బాధ్యత తనపై పడిందని నరేష్ తెలిపారు. తల్లికి వార్త చెప్పడం, సోదరుడు రాజేష్‌ను ఓదార్చడం, హాస్పిటల్ బిల్లులు, అంత్యక్రియల ఏర్పాట్లు వంటివన్నీ తానొక్కడినే చూసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. తన తండ్రి ఇండస్ట్రీలో ఎందరికో సహాయం చేశారని, ఆయన మరణం తర్వాత అందరూ కుంగిపోయారని నరేష్ అన్నారు. మూడవ రోజు తండ్రికి అంతిమ సంస్కారాలు జరుగుతున్న సమయంలో తాను పూర్తిగా కుప్పకూలిపోయానని, అప్పుడు మాత్రమే తనలోని బాధ బయటపడిందని తెలిపారు.
ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..
అంతేకాకుండా, 2011 జనవరి 21న తన తండ్రి చనిపోగా, సరిగ్గా 2013 జనవరి 21న తన బాబాయ్ కూడా మరణించారని నరేష్ గుర్తు చేసుకున్నారు. తండ్రితో తొమ్మిది సినిమాలు చేస్తే, బాబాయ్‌తో దాదాపు నలభై సినిమాలు చేశానని, ఆయన తన ప్రతి సినిమాకు స్టిల్ ఫోటోగ్రాఫర్‌గా పనిచేశారని చెప్పారు. తండ్రి మరణించిన తేదీనే బాబాయ్ మరణించడం తనను మరింత కలచివేసిందని, అది తన జీవితంలో మరో పెద్ద దెబ్బ అని నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు తమ కుటుంబానికి పెద్ద లోటును సృష్టించాయని, నేటికీ తమకు మంచి జరిగినా చెడు జరిగినా ముందుగా తండ్రి గురించే ఆలోచిస్తామని ఆయన అన్నారు. పిల్లలు పుట్టినప్పుడు కూడా తండ్రి ఉండి ఉంటే బాగుండేదనిపిస్తుందని నరేష్ అన్నారు.
ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..
ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..
