PM Modi: ఛఠ్ వేడుకలు ప్రారంభం.. ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు..

విశ్వాసానికి, ప్రకృతి ప్రేమకు ప్రతీక అయిన ఛఠ్ పూజ శనివారం నహయ్-ఖాయ్ తో ప్రారంభమైంది. ఈ నాలుగు రోజుల మహా పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఛఠ్ పండుగ క్రమశిక్షణ, కుటుంబ సామరస్యానికి చిహ్నమని మోదీ అన్నారు. అలాగే, బీహార్ కోకిల శారదా సిన్హా పాటలు ఈ పండుగకు మరింత స్ఫూర్తినిస్తాయని ఆయన గుర్తు చేసుకున్నారు.

PM Modi: ఛఠ్ వేడుకలు ప్రారంభం.. ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు..
Pm Modi Hails Chhath Puja

Updated on: Oct 25, 2025 | 9:39 AM

విశ్వాసానికి ప్రతీకగా నిలిచే గొప్ప పండుగ ఛఠ్ పూజ శనివారం నహయ్-ఖాయ్ పవిత్ర ఆచారంతో వైభవంగా ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు అత్యంత భక్తి, ఉత్సాహంతో జరిగే ఈ పండుగను ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది భారతీయులు జరుపుకుంటారు. ఈ పవిత్రమైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు, ముఖ్యంగా బీహార్‌లోని భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘‘నాలుగు రోజుల పాటు జరిగే ఛత్ పండుగ ఈరోజు నహే-ఖే పవిత్ర ఆచారాతో ప్రారంభమైంది. బీహార్‌తో సహా దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని మోదీ తెలిపారు.

మోదీ సందేశం

ఛఠ్ పండుగ మన సంస్కృతికి చిహ్నం అని, ఇది నిరాడంబరత, క్రమశిక్షణకు చాలా ముఖ్యమని మోదీ చెప్పారు. ఈ పండుగ కుటుంబ బంధాలను, సమాజంలో మంచి వాతావరణాన్ని పెంచుతుందని ఆయన తెలిపారు. ఛఠ్ అనేది విశ్వాసం, దేవుడిపై ప్రేమ, ప్రకృతిని గౌరవించే పండుగ. సూర్యాస్తమయం, సూర్యోదయ సమయాల్లో సూర్యుడికి నైవేద్యాలు పెడతారు. ఈ పండుగ పాటలు కూడా భక్తితో, ప్రకృతిపై ప్రేమతో నిండి ఉంటాయి” అని మోదీ అన్నారు. ఛఠీ మైయా దేవత అందరినీ ఆశీర్వదించాలని ఆయన కోరుకున్నారు. ప్రస్తుతం ఛఠ్ పండుగ ప్రపంచంలోని అన్ని మూలల్లో ఒక గొప్ప ఉత్సవంగా జరుగుతోందని, విదేశాల్లో ఉండే భారతీయ కుటుంబాలు కూడా ఇందులో ఉల్లాసంగా పాల్గొంటున్నాయని ప్రధాని మోదీ తెలిపారు

నా అదృష్టం

తాను నిన్న బెగుసరాయ్‌ను సందర్శించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. బీహార్ కోకిలగా పిలవబడే ప్రముఖ గాయని శారదా సిన్హా జీకి బెగుసరాయ్‌తో దగ్గర సంబంధం ఉంది. శారదా సిన్హా జీతో పాటు బీహార్‌లోని చాలా మంది కళాకారులు తమ పాటలతో ఛఠ్ పండుగకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చారని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు.

నాలుగు రోజుల ఆచారాలు

1వ రోజు: నదిలో స్నానం చేసి శుద్ధి చేసుకుంటారు. పప్పు, కూరగాయలతో మొదటి నైవేద్యం తయారుచేస్తారు.

2వ రోజు (ఖర్ణ): రోజంతా ఉపవాసం ఉంటారు. సాయంత్రం దేవుడికి బెల్లం, బియ్యంతో చేసిన ప్రసాదం సమర్పించి, ఆ ప్రసాదం తిని ఉపవాసం విరమిస్తారు.

3వ రోజు: సాయంత్రం నీళ్ల దగ్గర నిలబడి అస్తమించే సూర్యుడికి పూజ చేసి నైవేద్యాలు సమర్పిస్తారు.

4వ రోజు (ఉషా అర్ఘ్యం): చివరి రోజు ఉదయించే సూర్యుడికి పూజ చేసి నైవేద్యాలు సమర్పిస్తారు.. ఆ తర్వాత ఉపవాసం విరమించి అందరికీ ప్రసాదం పంచుతారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..