PM Modi: దేశవ్యాప్తంగా మొదలైన రంజాన్ ఉపవాస దీక్షలు.. ముస్లింలకు ప్రధాని మోదీ ప్రత్యేక విషెస్..
నెలవంక దర్శనంతో ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం నేటి నుండి ప్రారంభమైంది. ఈ పవిత్ర మాసం సమాజంలో ఐక్యతను, శాంతిని పెంపొందించాలని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు రంజాన్ ముబారక్ తెలియజేశారు. కఠిన ఉపవాస దీక్షలు, తరావీహ్ ప్రార్థనలు, దానధర్మాలతో ఆధ్యాత్మిక మార్గంలో సాగే ఈ మాసం విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ముస్లింల అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం దేశంలోని పలు ప్రాంతాల్లో నెలవంక కనిపించడంతో, ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం తొమ్మిదవ నెల అయిన రంజాన్ మొదలైనట్లు మత పెద్దలు ప్రకటించారు. రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ఆయన తన సందేశాన్ని పంచుకున్నారు. ‘‘రంజాన్ ముబారక్.. ఈ పవిత్ర మాసం సమాజంలో ఐక్యతా స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలి. ప్రతిచోటా శాంతి, శ్రేయస్సు నెలకొనాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధాని తెలిపారు.
చంద్ర దర్శనం – ఉపవాసాల ప్రారంభం
బుధవారం సాయంత్రం నెలవంకను ఢిల్లీలోని ఫతేపురి మసీదు షాహి ఇమామ్ మౌలానా ముఫ్తీ ముకర్రం అహ్మద్, జామా మసీదు నాయబ్ షాహి ఇమామ్ సయ్యద్ షాబాన్ బుఖారీ ధృవీకరించారు. దీంతో నేటి నుండి ముస్లింలు 30 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు ఉంటారు. తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు వారు అన్నపానీయాలు తీసుకోకుండా భక్తిశ్రద్ధలతో గడుపుతారు.
ప్రార్థనలు – ఆధ్యాత్మికత
రంజాన్ మాసంలో మసీదులు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి. ఈ మాసంలో మసీదులలో తరావీహ్ అని పిలిచే ప్రత్యేక సాయంత్రం ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ ప్రార్థనల సమయంలో పవిత్ర ఖురాన్ మొత్తాన్ని పారాయణం చేస్తారు. ఈ ప్రక్రియ ఈద్ నెలవంక కనిపించే వరకు కొనసాగుతుంది. కేవలం ఉపవాసం మాత్రమే కాకుండా ఈ నెలలో దానధర్మాలు చేయడం, ధ్యానం, ప్రార్థనల ద్వారా క్రమశిక్షణను అలవరుచుకోవడంపై ముస్లింలు ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, సోదరభావం పెంపొందించే ఈ పవిత్ర మాసం నేటి నుండి దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ప్రారంభమైంది.
Ramzan Mubarak!
May this auspicious month further the spirit of togetherness in our society. May there be peace and prosperity everywhere.
— Narendra Modi (@narendramodi) February 18, 2026
ద్వైపాక్షిక చర్చల పర్వం
మరోవైపు దేశ రాజధాని వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 కీలక ఘట్టానికి చేరుకుంది. గురువారం ఉదయం భారత్ మండపంలో సమ్మిట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఉదయం భారత్ మండపానికి చేరుకోనున్న ప్రపంచ దేశాల నేతలకు ప్రధాని మోదీ సాదర స్వాగతం పలకనున్నారు. అనంతరం ఉదయం 9:15 గంటలకు ప్రపంచ నాయకులతో కలిసి ఫొటోలు దిగుతారు. ఫొటో సెషన్ తర్వాత, ప్రధాని ఏఐ సమ్మిట్‌ను అధికారికంగా ప్రారంభించి, ఏఐ భవిష్యత్తు, దేశ పాత్రపై తన దార్శనికతను పంచుకుంటారు.
సమ్మిట్ ప్రత్యేకతలు
ఫిబ్రవరి 16 నుండి 21 వరకు జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక సమ్మిట్.. పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్ అనే మూడు ప్రధాన సూత్రాల ఆధారంగా సాగుతోంది. ప్రపంచ AI సదస్సు గ్లోబల్ సౌత్‌లో నిర్వహించడటం ఇదే తొలిసారి. ఈ సదస్సుకు 20 మందికి పైగా దేశాధినేతలు, 60 మంది మంత్రులు, దాదాపు 500 మంది గ్లోబల్ AI లీడర్లు హాజరయ్యారు. ఇండియా ఏఐ మిషన్, డిజిటల్ ఇండియా చొరవ కింద ఏఐ చర్చలను కేవలం సిద్ధాంతాలకే పరిమితం చేయకుండా వాటిని క్షేత్రస్థాయి అభివృద్ధి ఫలితాలుగా మార్చడమే ఈ సమ్మిట్ ప్రధాన ఉద్దేశ్యం. ఈ సదస్సు ద్వారా ప్రపంచ AI చర్చల్లో భారతదేశం తన నాయకత్వ స్థానాన్ని మరోసారి చాటుకుంటోంది.
