
విపత్తులను తట్టుకోగలిగే మౌలిక సదుపాయాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని తప్పనిసరిగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. రవాణా మౌలిక సదుపాయాలు ఎంత ముఖ్యమైనవో సామాజిక, డిజిటల్ మౌలిక సదుపాయాలు కూడా అంతే ముఖ్యమైనవంటూ ఈ సందర్బంగా స్పష్టంచేశారు. విపత్తు తట్టుకునే మౌలిక సదుపాయాలపై కూటమి (CDRI) కోసం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ప్రకృతి వైపరీత్యాలను, వాటిని ఎలా ఉత్తమంగా నిర్వహించచ్చు అనే విషయాల గురించి ప్రధాని మోడీ ఈ సందర్భంగా పలు సూచలను చేశారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ.. “మిత్రులారా, ప్రతి దేశం ఇటీవల కాలంలో వివిధ రకాల విపత్తులను ఎదుర్కొంటుంది. విపత్తులను తట్టుకోగలిగే మౌలిక సదుపాయాలకు సంబంధించిన స్థానిక పరిజ్ఞానాన్ని సమాజం తప్పనిసరిగా అభివృద్ధి చేయాలి. మౌలిక సదుపాయాలను ఆధునీకరించేటప్పుడు, అటువంటి పరిజ్ఞానాన్ని తెలివిగా ఉపయోగించాల్సిన అవసరం ఉంది. స్థానిక పరిజ్ఞానంతో కూడిన ఆధునిక సాంకేతికతలు స్థితిస్థాపకతకు, నిర్వహణకు గొప్పవిగా ఉంటాయి” అని ప్రధాని మోడీ అన్నారు.
విపత్తు నిర్వహణ వేదిక Coalition for Disaster Resilient Infrastructure (CDRI) ప్రాముఖ్యత గురించి ప్రధాని మోడీ మాట్లాడుతూ.. “కేవలం నాలుగు సంవత్సరాలలో 40 దేశాలు CDRIలో భాగమయ్యాయి. గ్లోబల్ నార్త్, గ్లోబల్ సౌత్, చిన్న, పెద్ద దేశాలు దీనిద్వారా ఏకతాటిపైకి రావడంతో ఈ సదస్సు చాలా ముఖ్యమైనదిగా మారింది.. అంటూ పేర్కొన్నారు. “మేము మౌలిక సదుపాయాల గురించి చర్చిస్తున్నప్పుడు, కొన్ని ప్రాధాన్యతలను గుర్తుంచుకోవాలి. ఈ సంవత్సరం థీమ్ స్థితిస్థాపకత, సమగ్ర మౌలిక సదుపాయాలను అందించడం. ఆపద సమయంలో కూడా మౌలిక సదుపాయాలు ఎవరినీ వదిలిపెట్టకుండా ప్రజలకు సేవ చేయాలి. ఇంకా, మౌలిక సదుపాయాలపై సమగ్ర దృక్పథం అవసరం. రవాణా మౌలిక సదుపాయాలతో పాటు సామాజిక, డిజిటల్ మౌలిక సదుపాయాలు కూడా ముఖ్యమైనవి, ”అని ప్రధాని పేర్కొన్నారు.
ప్రస్తుతం భారతదేశం, ఐరోపా అంతటా మనకు వేడి తరంగాలు వీస్తున్నాయి.. భూకంపాల వల్ల అనేక ద్వీప దేశాలు దెబ్బతిన్నాయి. సిరియా, టర్కీలలో సంభవించిన భూకంపాల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచం సిడిఆర్‌ఐని గొప్ప అంచనాలతో చూస్తోందంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. గత విపత్తులను అధ్యయనం చేయడం.. వాటి నుంచి నేర్చుకోవడం ఒక మార్గం.. ఇందులో CDRI కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. ఇందులో పాలుపంచుకున్న ప్రభుత్వాలు మాత్రమే కాదు.. ప్రపంచ సంస్థలు, డొమైన్ నిపుణులు, ప్రైవేట్ రంగాలు కలిసి ఇందులో ప్రముఖమైన పాత్ర పోషిస్తాయన్నారు. విపత్తుల ప్రభావం స్థానికంగా ఉండదు, కాబట్టి మన స్పందన ఒంటరిగా కాకుండా సమగ్రంగా.. ఐక్యంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
My remarks at the International Conference on Disaster Resilient Infrastructure. https://t.co/OEjO3fww7n
— Narendra Modi (@narendramodi) April 4, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం..