PM Modi: 6 రోజులు.. 5 దేశాలు.. యుద్ధం వేళ ప్రధాని మోదీ విదేశీ టూర్.. ఎందుకో తెలుసా..?
6 రోజుల్లో 5 దేశాలు.. లక్ష్యం ఒక్కటే..భారత్ ఫస్ట్. పశ్చిమాసియా సంక్షోభం వేళ ప్రధాని మోదీ ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. యూఏఈ చమురు నిల్వల నుంచి.. 43 ఏళ్ల తర్వాత నార్వేతో సరికొత్త బంధం వరకు.. ఈ పర్యటన ఎంతో కీలకం. ముఖ్యంగా ఇటీవల ముగిసిన భారత్ ఈయూ ఎఫ్‌టీఏ చర్చల తర్వాత జరుగుతున్న ఈ టూర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రపంచ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, భారత ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత కీలకమైన విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టారు. మే 15 నుంచి 20 వరకు ఐదు దేశాల్లో సాగే ఈ పర్యటన కేవలం దౌత్య సంబంధాల కోసం మాత్రమే కాదు అంతర్జాతీయ సంక్షోభం నుంచి భారత్‌ను సురక్షితంగా ఉంచే ఒక మాస్టర్ ప్లాన్. పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశానికి అవసరమైన చమురు, వాయువు, రక్షణ వనరులను సమకూర్చుకోవడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం.
యూఏఈ: ఇంధన కొరతకు విరుగుడు
ప్రధాని పర్యటనలో మొదట యూఏఈలో పర్యటిస్తారు. ఇది మోదీకి అక్కడ ఎనిమిదవ పర్యటన కావడం ఇరు దేశాల మధ్య ఉన్న సాన్నిహిత్యానికి నిదర్శనం. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరాకు ఆటంకం కలగకుండా యూఏఈ అధ్యక్షుడు షేఖ్ మహమ్మద్ బిన్ జాయెద్‌తో మోదీ చర్చిస్తారు. భారత్‌లో ప్రస్తుతం 5.33 MMT సామర్థ్యం గల చమురు నిల్వలు ఉన్నాయి. వీటిని మరో 6.5 MMT పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం యూఏఈకి చెందిన ADNOC కంపెనీతో కీలక ఒప్పందాలు జరగనున్నాయి. యూఏఈలో నివసిస్తున్న 45 లక్షల మంది భారతీయుల భద్రత, ఉపాధి అంశాలు కూడా చర్చకు రానున్నాయి.
నెదర్లాండ్స్: టెక్నాలజీ పవర్ హౌస్
మే 15-17 తేదీల్లో ప్రధాని నెదర్లాండ్స్‌లో పర్యటిస్తారు. 2017 తర్వాత మోదీ అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. భారత్‌ను గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా మార్చాలన్న లక్ష్యంలో నెదర్లాండ్స్ సహకారం కీలకం. గ్రీన్ హైడ్రోజన్, స్మార్ట్ వాటర్ మేనేజ్‌మెంట్‌లో ఆ దేశంకున్న నైపుణ్యాన్ని భారత్ వినియోగించుకోనుంది. యూరప్‌లో భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో నెదర్లాండ్స్ ఒకటి. దాదాపు 27.8 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత పెంచడమే లక్ష్యం.
స్వీడన్: ఇన్నోవేషన్ – రక్షణ
మే 17-18 తేదీల్లో స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్‌లో ప్రధాని పర్యటన సాగుతుంది. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్‌తో కలిసి ప్రధాని మోదీ పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించడం, అంతరిక్ష పరిశోధనలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో స్వీడిష్ పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి పెడతారు.
నార్వే: 43 ఏళ్ల నిరీక్షణకు తెర
నార్వే పర్యటన ఈ ట్రిప్‌లోనే అత్యంత చారిత్రాత్మకమైనది. 1983 తర్వాత ఒక భారత ప్రధాని నార్వే వెళ్లడం ఇదే మొదటిసారి. ఓస్లోలో జరిగే ఈ సమావేశంలో ఐదు నార్డిక్ దేశాల (డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్‌లాండ్, స్వీడన్, నార్వే) ప్రధానులతో మోదీ భేటీ అవుతారు. నార్వే ప్రభుత్వ పెన్షన్ ఫండ్ ఇప్పటికే భారత్‌లో 28 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడులను క్లీన్ ఎనర్జీ, మౌలిక సదుపాయాల రంగాలకు మళ్లించేలా చర్చలు సాగుతాయి.
ఇటలీ: జార్జియా మెలోనీతో కీలక భేటీ
పర్యటన ముగింపు దశలో మే 20న ఇటలీలో మోదీ పర్యటిస్తారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో కలిసి జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ 2025-29 అమలును సమీక్షిస్తారు. ఇటీవల ముగిసిన భారత్-ఈయూ ఎఫ్‌టీఏ చర్చల నేపథ్యంలో ఇటలీ నుంచి భారత్‌కు వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెంచడంపై ఒప్పందాలు జరగనున్నాయి. కాగా ప్రపంచం యుద్ధ వాతావరణంలో ఉన్నప్పుడు, దేశంలో వంటగ్యాస్, పెట్రోల్ ధరలు పెరగకుండా చూడాలన్నా, నిరంతర ఇంధన సరఫరా జరగాలన్నా ఈ దేశాల మద్దతు భారత్‌కు అత్యవసరం. అందుకే ప్రధాని ఆయా దేశాల్లో పర్యటిస్తారు.
