అమ్మ బాబోయ్… వ్యాక్సిన్ రోయ్.. అంటూ పరుగులు పెట్టిన తమిళనాడువాసులు ఇప్పుడు భారీ వర్షంలో కూడా టీకా కోసం క్యూ కడుతున్నారు. కొందరైతే వ్యాక్సినేషన్ నుంచి తప్పించుకోడానికి చెట్లు ఎక్కారు. కరోనా సెకెండ్ వేవ్ ముగించుకుని మూడో వేవ్‌కు ఎంట్రీ ఇస్తున్న సమయంలో జనం మూడ్ మారింది.. అంతే కాదు టీకాపై అవగాహన పెరిగింది. టీకా వేయించుకునేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరు నగర వాసులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు.
కోయంబత్తూరు జిల్లాలో కరోనా కేసులు పెరగడంతో.. వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టారు అధికారులు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు. అధికారుల శ్రమ ఫలించింది. దాదాపుగా ఒక కిలోమీటర్ల పొడవైన క్యూలో నిలబడి యువకులతోపాటు అన్ని వయసుల వారు తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకుంటే స్వేచ్ఛగా ఉండవచ్చని ఈ క్యూ లైన్‌లోని ముఖ్యంగా యువత చూస్తున్నారు. టీకాలు వేసిన తరువాత వారు నిర్బంధంగా గడపాల్సిన అవసరం లేదని నమ్మకంగా ఉన్నారు. టీకా తీసుకుంటే ఎక్కడైనా తిరగడానికి ఇబ్బంది ఉండదని, అందుకే టీకా వేసుకోవడానికి ఉత్సాహంగా వచ్చామని క్యూ లైన్ లో ఉన్న యువకులు చెప్పడం గమనార్హం.
గత రెండు నెలల క్రితం కోయంబత్తూరులోని మెర్కు , తొడర్చిమలై ప్రాంతాలలో నివసిస్తున్న గ్రామస్థులకు వ్యాక్సినేషన్ కి అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు చేశారు. ఇక వ్యాక్సినేషన్ ప్రారంభవుతుందనగా ఒక్కరు కూడా రాలేదు. దీంతో ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించారు. ఇలా ఇళ్లదగ్గరకు వెళ్లగానే చెట్లెక్కి కూర్చున్నారు జనం. వ్యాక్సిన్ తమకు అక్కర్లేదంటూ గ్రామస్తులు పారిపోయారు. కొందరైతే అధికారులతో డైరెక్టుగా వాగ్వాదానికి దిగారు. ఇప్పుడు అక్కడ సీన్ పూర్తిగా మారిపోయింది.