- Telugu News India News People being made victims investment scams name of celebrities creating deepfake videos
డీప్‌ఫేక్ వీడియోలు.. వాళ్లకు ఇవే ఇప్పుడు వెపన్స్.. తేడా వస్తే ఖేల్ ఖతం..!
ఒరిజినల్ వీడియో-ఆడియో ఫైల్‌పై డిజిటల్ కాంపోజిట్‌ను ప్రయోగించి, మెషిన్ లెర్నింగ్ టూల్స్‌తో డీప్‌ఫేక్‌లు సృష్టించడం పాత ట్రెండే. ఇలా డిజైన్ చేసిన సెలబ్రిటీల వీడియోల్ని ఫైనాన్షియల్ ఫ్రాడ్స్‌కు ఉపయోగించడం మోసగాళ్లు పాల్పడుతున్న కొత్త ట్రెండ్. డీప్‌ఫేక్ వీడియోలు ఇప్పుడు రాబరీగాళ్లకు చిక్కిన సరికొత్త వెపన్స్. ప్రముఖుల పాపులారిటీని ప్రయోగించి, వాళ్లు చెప్పని మాటల్ని చెప్పినట్టుగా చూపించి డీప్‌ఫేక్ వీడియోలతో జనాన్ని నట్టేట ముంచుతున్నారు సైబర్ కేటుగాళ్లు.
Updated on: Sep 16, 2025 | 12:52 PM

డిజైన్ చేసిన సెలబ్రిటీల వీడియోల్ని ఫైనాన్షియల్ ఫ్రాడ్స్‌కు ఉపయోగించడం మోసగాళ్లు పాల్పడుతున్న కొత్త ట్రెండ్. డీప్‌ఫేక్ వీడియోలు ఇప్పుడు రాబరీగాళ్లకు చిక్కిన సరికొత్త వెపన్స్. ప్రముఖుల పాపులారిటీని ప్రయోగించి, వాళ్లు చెప్పని మాటల్ని చెప్పినట్టుగా చూపించి డీప్‌ఫేక్ వీడియోలతో జనాన్ని నట్టేట ముంచుతున్నారు సైబర్ కేటుగాళ్లు.

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీ, ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవన్, జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేసాయ్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ సుధా మూర్తి.. ఇలా ప్రముఖుల డీప్‌ఫేక్ వీడియోలను క్రియేట్ చేసి, వాళ్ల ఫేమ్‌నే పెట్టుబడిగా పెట్టి, వాళ్లు ఇవ్వని వ్యాపార సలహాల్ని వాళ్ల పేరుమీద ప్రచారంలో పెట్టి అమాయకులకు టోకరా వేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.

ముఖేష్ అంబానీ పేరిట ప్రచారంలో ఉన్న ఒక బిజినెస్ అడ్వైజ్‌ని నమ్మి.. రూ. ఏడు లక్షలు పోగొట్టుకున్నాడు ముంబైకి చెందిన ఓ డాక్టర్. వేల కోట్లను లక్షల కోట్లకు పెంచుకుని ఏసియాలోకెల్లా రిచీరిచ్చెస్ట్‌గా మారిన ముఖేష్ అంబానీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజ్ ఇస్తే ఎవరు మాత్రం స్వీకరించరు చెప్పండి? అందుకే, 16 బ్యాంకు అకౌంట్లలోకి పదేపది రోజుల్లో ఏడు లక్షల 10 వేలు డిపాజిట్ చేశాడు. తర్వాత ట్రేడింగ్ వెబ్‌సైట్ నుంచి ప్రాఫిట్‌ని విత్‌డ్రా చేసుకోబోతే.. అంతా మోసం అని తేలిపోయింది.

ఇన్ఫోసిస్ ఛైర్‌పర్సన్ సుధామూర్తి ఒక ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రమోట్ చేస్తున్నట్టు ఫేక్‌వీడియో ప్రచారంలోకొచ్చింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిందని నమ్మి, ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌లో రూ. 20 లక్షలు పోగొట్టుకున్నాడు హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్. ఎప్పుడూ ఆధ్యాత్మిక పాఠాలు చెప్పే సద్గురు జగ్గీ వాసుదేవన్.. ఇప్పుడు బిజినెస్ క్లాసులు కూడా తీసుకుంటున్నారా? సులభంగా ఆదాయం గడించాలనుకునే వాళ్లకు మార్గదర్శనం చేస్తున్నారా? సోషల్ మీడియాలో సద్గురు వీడియోను చూసి, అదే నిజమని భ్రమించి బెంగుళూరుకు చెందిన ఓ మహిళ మూడున్నర కోట్ల రూపాయలకు పైగా మోసపోయింది. ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. రిపోర్ట్ కాని డీప్‌ఫేక్ మోసాలు వేలల్లో ఉన్నాయి.

డీప్‌ఫేక్ టెక్నాలజీ గురించి కనీస అవగాహన లేనివాళ్లే సైబర్ మోసగాళ్లకు సాఫ్ట్ టార్గెట్లు. వీళ్లే నకిలీ పెట్టుబడి అవకాశాల్ని నమ్మి అడ్డంగా మోసపోతున్నారు. మూడే మూడేళ్లలో మన దేశంలో సెలబ్రిటీల ఫేక్ వీడియోలతో జరిగే మోసాలు 550 శాతం పెరిగాయి. 48 గంటల్లోగా ఫిర్యాదు చేస్తేనే డబ్బు తిరిగి రావడానికి అవకాశం ఉంది.

సైబర్ మోసగాళ్లకు, స్కిల్డ్ హ్యాకర్స్‌కి పెద్ద ఆసరాగా మారింది డీప్‌ఫేక్ ఎక్స్‌పరిమెంట్. డబుల్ చెక్, ట్రిపుల్ చెక్ చేసినా ఏది రియల్ ఏది ఫేక్ తెలుసుకోవడం కష్టంగా మారిపోయింది. రాబోయే రోజుల్లో ఇన్వెస్ట్‌మెంట్ రంగంలో డీప్‌ఫేక్ మోసాలు పెరిగే ప్రమాదముంది గనుక.. మనమే అలర్ట్‌గా ఉండాలి.




