
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ సంస్థ నిర్వహణలో జరిగిన కొన్ని తీవ్రమైన లోపాలపై బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. ముఖ్యంగా బాలల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ (CSAM), డీప్‌ఫేక్ వీడియోలు, హానికరమైన కంటెంట్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టడంలో మెటా విఫలమైందని అంగీకరించారు. వినియోగదారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందని, ఆ విషయంలో జరిగిన పొరపాట్లకు చింతిస్తున్నట్లు పేర్కొన్నారు.
కాగా ఈ రోజు ఉదయం ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాకు పార్లమెంటరీ సమాచార సాంకేతిక స్థాయీ సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మూడు రోజుల్లోగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని కమిటీ ఆదేశించింది. లేనిపక్షంలో ఐటీ చట్టంలోని సెక్షన్ 79(3) కింద కంపెనీకి ఉన్న రక్షణను ఉపసంహరించి, ప్రచురణకర్తగా పరిగణించి చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలించాలని సూచించింది.
లోక్‌సభ సచివాలయం నుంచి ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శికి పంపిన లేఖలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. పరీక్షల వివాదాలు, పేపర్ లీక్‌లపై విద్యార్థులు, జెన్-జెడ్‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్ ఐదు నుంచి ఆరు గంటల పాటు అందుబాటులో లేకుండా చేయడాన్ని కమిటీ తీవ్రంగా పరిగణించినట్లు పేర్కొన్నారు.
అంతేకాకుండా బాలల లైంగిక వేధింపుల కంటెంట్ (CASM), మహిళలను కించపరిచే పోస్టులను తొలగించడంలో విఫలమయ్యే సోషల్ మీడియా మధ్యవర్తి వేదికలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీ కోరింది. ఐటీ చట్టంలోని నిబంధనల ప్రకారం అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇదే సమావేశంలో మోసపూరిత యాప్‌ల ద్వారా పెట్టుబడిదారులు రూ.48 లక్షలకు పైగా నష్టపోయిన కేసులో గూగుల్ ఇండియా పాత్రపై కూడా చర్చ జరిగింది. సైబర్ మోసగాళ్లతో పాటు సంబంధిత సంస్థల బాధ్యతను కూడా పరిశీలించాలని కమిటీ అభిప్రాయపడింది.