Criminal Law Bills: వాటి స్థానంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలు.. ఇక దబిడి దిబిడే..
IPC, CRPC , ఎవిడెన్స్ యాక్ట్‌లో మార్పులు తెస్తూ కేంద్రం మూడు క్రిమినల్ చట్ట సవరణ బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. మూకహత్యలతో పాటు పలు నేరాలకు శిక్షను పెంచారు. ఆర్ధిక భద్రతకు ముప్పు కలిగించే వాళ్లను కూడా ఉగ్రవాదులుగా గుర్తిస్తూ చట్టంలో మార్పులు చేశారు.

పార్లమెంట్ నుంచి 141 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ విధించిన అనంతరం కేంద్రం మూడు సవరించిన క్రిమినల్ చట్టసవరణ బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సభలో ప్రవేశపెట్టారు. ఇప్పుడున్న ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్‌పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్టుల స్థానంలో వీటిని తీసుకొస్తున్నారు. ఈ బిల్లులను మొదటగా ఆగస్టులో ప్రవేశపెట్టారు. తర్వాత వీటిని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి పంపించారు. స్టాండింగ్ కమిటీ సూచించిన మార్పులను చేర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులను వెనక్కి తీసుకుంది. గురువారం ఈ బిల్లులపై చర్చ జరుగనుంది. శుక్రవారం వీటిపై ఓటింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఈ బిల్లుల్లో ప్రధానంగా ఆరు మార్పులు చేశారు.
వీటిలో ‘సామాజిక సేవ’ను శిక్షగా విధించే అంశం కూడా ఉంది. మూక దాడులు, ద్వేషపూరిత నేరాల శిక్షలను పెంచాలని నిర్ణయించారు. గతంలో మూక దాడులు, ద్వేషానికి సంబంధించిన నేరాలకు కనీసం ఏడేళ్ల శిక్ష విధించాలనే నిబంధన ఉంది. ఈ నిబంధన ప్రకారం, కులం లేదా మతం వంటి కారణాలతో అయిదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి సామూహిక హత్యకు పాల్పడితే ఆ మూకలోని ప్రతీ వ్యక్తికి కనీసం ఏడేళ్ల శిక్ష పడుతుంది.
ఉగ్రవాద కార్యకలాపాల గురించి తొలిసారి భారతీయ న్యాయ సంహిత (ఇండియన్ జ్యుడీషియల్ కోడ్) ద్వారా ప్రవేశపెట్టారు. పూర్వం వీటికి నిర్దిష్ట చట్టాలు ఉండేవి. ఇందులో చేసిన కీలక మార్పు ఏంటంటే, ఆర్థిక భద్రతకు ముప్పును కలిగించడం కూడా ఉగ్రవాద కార్యకలాపాల పరిధిలోకే తెచ్చారు. నకిలీ నోట్లను ఉత్పత్తి చేయడం, నోట్ల స్మగ్లింగ్‌కు పాల్పడుతూ ఆర్థిక స్థిరత్వానికి హాని కలిగించడం కూడా ఉగ్రవాద చట్టం కిందకు వస్తుంది.
భారత్‌లో రక్షణ లేదా ఇతర ప్రయోజనాల కోసం విదేశాల్లో ఆస్తులను ధ్వంసం చేయడాన్ని కూడా ఉగ్రవాద కార్యకలాపంగా పరిగణిస్తారు. ఇప్పుడు, భారత్‌లో ప్రభుత్వం వద్ద తమ డిమాండ్లను నెరవేర్చుకోవడం కోసం వ్యక్తులను నిర్బంధించడం లేదా కిడ్నాప్ చేయడం వంటివి కూడా ఉగ్రవాద కార్యకలాపాల కిందకే వస్తాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




