పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. సోమవారం నుంచి ఉభయ సభలు కొనసాగనున్నాయి.. అయితే, సభలో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తబోయే అంశాలపై క్లారిటీ ఇచ్చాయి రాజకీయ పార్టీలు. సోషల్ మీడియా వేధింపులపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని టీడీపీ తెలిపింది. మరోవైపు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లపై అక్రమ కేసులు, అరెస్ట్‌లను ఉభయ సభల్లో ప్రస్తావించాలని వైసీపీ నిర్ణయించుకున్నాయి. ఇటు పార్టీ నిరోధక చట్టం, లగచర్ల అంశాన్ని రాజ్యసభలో లెవనెత్తుతామని బీఆర్ఎస్ వెల్లడించింది.
సోమవారం (నవంబర్ 25) నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగేలా అన్ని పార్టీలు సహకరించాలని కోరింది కేంద్రం. కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో జరిగిన భేటీలో సభలో ప్రస్తావించాల్సిన అంశాలపై రాజకీయ పార్టీలు క్లారిటీ ఇచ్చాయి.
పార్లమెంట్ సమావేశాల్లో సోషల్ మీడియా వేధింపులపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు టీడీపీ లోక్‌సభాపక్షనేత లావు శ్రీకృష్ణదేవరాయలు. దీంతో పాటు విభజన చట్టంలోని హామీల అమలుపై కూడా చర్చిస్తామని తెలిపారు.
ఏపీలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లపై కేసులు, అరెస్ట్‌ల అంశంపై చర్చించాలని డిమాండ్ చేసినట్టు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. జగన్ హయాంలో అదానీతో ఎలాంటి సోలార్ ఒప్పందాలు చేసుకోలేదన్నారు. దీనిపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవే అన్నారు.
పార్లమెంట్‌లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకురావాలన్నారు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సురేష్‌రెడ్డి. చట్టం సరిగ్గా లేకపోవడం వల్లే ఈ అంశం తరచూ కోర్టుకు వెళుతోందన్నారు. భూసేకరణ కోసం చట్టం ఉన్నప్పటికీ దానికి విరుద్ధంగా తెలంగాణలో భూమిని సేకరిస్తున్నారని.. దీనిపై కూడా చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. కీలకమైన వక్ఫ్ చట్ట సవరణ బిల్లును కూడా ఈ సమావేశాల్లోనే తీసుకురానుంది. మరోవైపు అదానీ కేసు, మణిపూర్ అల్లర్లు, వక్ఫ్ సవరణ బిల్లు, చైనా సరిహద్దు అంశాలపై సమయం కేటాయించాలని విపక్షాలు కోరాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..