రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇకనుంచి సీనియర్ సిటిజన్లకు రాయితీలను తిరిగి పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కోవిడ్-19 పరిస్థితి సాధారణ స్థితికి చేరుకున్న నేపథ్యంలో స్లీపర్, ఏసీ-3 తరగతుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్‌లకు రైలు ఛార్జీలలో రాయితీని తిరిగి ప్రారంభించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ.. రైల్వే మంత్రిత్వ శాఖను కోరింది. ఇది బలహీనమైన వర్గాలకు, అవసరమైన పౌరులకు సహాయం చేస్తుందని పేర్కొంది. సీనియర్ సిటిజన్లకు, ముఖ్యంగా స్లీపర్ క్లాస్, 3A క్లాస్‌లలో ఛార్జీలలో రాయితీలను పునఃప్రారంభించడాన్ని సానుభూతితో పరిశీలించాలని రాధా మోహన్ సింగ్ నేతృత్వంలోని రైల్వేల ప్యానెల్ ఈ సిఫార్సు చేసింది. ఇలా సూచించడం ఇది రెండవసారి.
2020 మార్చిలో కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి చెందిన తర్వాత రైల్వే రాయితీలను రైల్వే ఉపసంహరించుకుంది. దీనికి ముందు రైల్వే 60 ఏళ్లు పైబడిన పురుషులకు ఛార్జీలలో 40% తగ్గింపు.. 58 ఏళ్లు పైబడిన మహిళలకు 50% రాయితీని అందించేది. ఈ రాయితీలు మెయిల్, ఎక్స్‌ప్రెస్, రాజధాని, శతాబ్ది, దురంతో లాంటివాటితోపాటు.. రైళ్ల అన్ని తరగతుల ఛార్జీలలో అనుమతించారు. రైల్వే అధికారులు అందించిన సమాచారం ప్రకారం.. కోవిడ్ పూర్తిగా తగ్గుముఖం పట్టడం.. ఇప్పుడు పరిస్థితులు సాధారణమవ్వడంతో ఇండియన్ రైల్వే సాధారణ వృద్ధిని సాధించిందని ప్యానెల్ పేర్కొంది.
ఒక ప్రశ్నకు సమాధానంగా రైల్వే మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. “కోవిడ్-19 మహమ్మారి రైల్వే ఆర్థిక స్థితిని ప్రతికూలంగా ప్రభావితం చేసింది. ప్రభుత్వం 2019-20లో ప్రయాణీకుల టిక్కెట్లపై రూ.59,837 కోట్ల రాయితీలు ఇచ్చింది. ఇది 53% రాయితీకి సమానం. సగటున, రైల్వేలో ప్రయాణించే ప్రతి వ్యక్తికి.. ఈ సబ్సిడీ ప్రయాణికులందరికీ కొనసాగుతోంది. దివ్యాంగులు, విద్యార్థులు, రోగుల వంటి అనేక వర్గాలకు ఈ సబ్సిడీ మొత్తాన్ని మించిన మరిన్ని రాయితీలు కొనసాగుతున్నాయి.” అని పేర్కొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..