India – Pakistan: డ్రామాలొద్దు.. ఉగ్రవాదంపై మీ బుద్ధి మారేవరకు నో వాటర్‌.. పాకిస్తాన్‌కు తేల్చి చెప్పేసిన భారత్

అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకోవడం పాకిస్తాన్‌కు అలవాటే! మొన్న అణ్వస్త్రాల పేరుతో పులిలా గర్జించిన పాక్‌..ఇవాళ పిల్లిలా మారిపోయి మ్యావ్‌ మ్యావ్‌ అంటోంది. సింధు జలాల కోసం..నీళ్లివ్వండి మహా ప్రభో అంటూ భారత్‌ను అడుక్కుటోంది. కపట నాటకాలు చాలించు అంటూ పాక్‌కి మరోసారి ఇండియా వార్నింగ్‌ ఇచ్చింది.

India - Pakistan: డ్రామాలొద్దు.. ఉగ్రవాదంపై మీ బుద్ధి మారేవరకు నో వాటర్‌.. పాకిస్తాన్‌కు తేల్చి చెప్పేసిన భారత్
India Halts Indus Waters to Pakistan

Updated on: Aug 13, 2025 | 9:45 AM

భారత్‌పై పాక్‌ ఉగ్రవాద దాడుల నేపథ్యంలో పాకిస్తాన్‌కు సింధూ జలాలను ఆపేస్తూ.. ఆపరేషన్‌ సింధూర్‌ సందర్భంగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఓ వైపు పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్, మాజీ మంత్రి బిలావల్‌ భుట్టో బెదిరింపులకు పాల్పడుతుండగా..మరోవైపు తమకు నీటిని విడుదల చేయాలని ఆ దేశ విదేశాంగ శాఖ భారత్‌ను వేడుకుంటోంది. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత పాక్‌కు నిలిపివేసిన సింధూ జలాల సరఫరాను తిరిగి పునరుద్ధరించాలని ఆ దేశ విదేశాంగ శాఖ తాజాగా భారత్‌ను కోరింది. ఈ ఒప్పందాన్ని నమ్మకంగా, న్యాయబద్ధంగా కొనసాగించాలని కోరుతున్నట్లు తెలిపింది. అయితే ఇప్పటికే తీర్పును తిరస్కరిస్తున్నట్టు భారత్ ప్రకటించింది.

ఆసిం మునీర్‌, బిలావల్‌ భుట్టో ప్రేలాపనలు

మొన్న పాకిస్తాన్‌ సైన్యాధిపతి అసీం మునీర్‌ భారత్‌పై అణు హెచ్చరికలు చేస్తూ.. నోరు పారేసుకున్నాడు. భారత్‌ అనేది హైవేపై వస్తున్న ఒక మెర్సిడెస్‌ కారులాంటిది. కానీ.. పాకిస్థాన్‌ మాత్రం కంకరతో నిండిన ఓ డంప్ లారీలాంటిది. ఒకవేళ కారు వచ్చి లారీని ఢీకొంటే ఎవరికి నష్టం? అని మునీర్‌ తన ప్రసంగంలో పేర్కొన్నాడు. ఇక ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావల్‌ భుట్టో సైతం భారత్‌పై పిరికిపంద ప్రేలాపనలు చేశాడు. సింధూ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగితే.. యుద్ధం గురించి ఆలోచించడం తప్ప మరో మార్గం లేదని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికాడు.

ప్లీజ్ నీళ్లవ్వండి.. అడుక్కుంటున్న పాక్‌

అటు పాక్‌ ఆర్మీ చీఫ్‌, ఆ దేశ మాజీ మంత్రి బిలావల్‌ భుట్టోలు.. యుద్ధం, అణ్వస్త్రాలు అంటూ మైకుల ముందు రెచ్చిపోతుంటే.. మరోవైపు నీటిని విడుదల చేయండి మహా ప్రభో అంటూ భారత్‌ను… పాక్‌ విదేశాంగ శాఖ అభ్యర్థిస్తోంది. పాక్‌ కపట నాటకాలకు ఇది అద్దం పడుతోంది. అందితే జట్టు, అందకపోతే కాళ్లు అనే దాని మనస్తత్వాన్ని తెలియజెబుతున్నాయి అంటున్నారు నిపుణులు..

1960ల్లో భారత్‌, పాక్‌ మధ్య సింధూ నదీ జలాల ఒప్పందం కుదిరింది. ఉగ్రదాడి దృష్ట్యా దీని అమలును మన దేశం నిలిపివేయడంతో…పాకిస్తాన్‌కు నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. పాక్‌లోని జలాశయాల్లో నీటిమట్టం దారుణంగా పడిపోయింది. ఇక వాటినుంచి నీటిని తీసుకోలేని పరిస్థితి ఎదురవుతోంది. గతేడాదితో పోలిస్తే సింధు బేసిన్‌లో నీటి ప్రవాహం 15 శాతం తగ్గింది. వేసవిలో పంటలు ఎండి కష్టాల్లో పడిన రైతులకు ఖరీఫ్‌లో మరిన్ని కష్టాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. భారత్‌ నిర్ణయంతో 21 శాతం నీటి కొరత ఏర్పడుతుందని పాక్‌ అంచనా వేసింది. అయితే ఉగ్రవాదంపై పాక్‌ తీరు మారే వరకూ ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని భారత్‌ ఇప్పటికే పలుమార్లు స్పష్టంచేసింది.

ఓవైపు అణ్వాయుధాలు, యుద్ధం అని రంకెలు వేస్తున్న పాక్‌…మరోవైపు నీళ్ల కోసం భారత్‌కు సలాం కొట్టి గులాంలా దేబిరిస్తోంది. అయితే ఉగ్రవాదం- శాంతి ఒకే ఒరలో ఉండవని, పాక్‌కు ముఖం మీద కొట్టినట్లు తేల్చిచెప్పేసింది భారత్‌..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..