Operation Sindoor: అమాయకులను చంపుతారా..? ఇండియాకు పాకిస్థాన్‌ ఆర్మీ ప్రతినిధి చౌదరి వార్నింగ్‌

భారతదేశం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సిందూర్‌ను నిర్వహించింది. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా ఈ ఆపరేషన్ జరిగింది. పాకిస్థాన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది, ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. భారత ప్రభుత్వం కూడా దృఢంగా స్పందించింది. పాకిస్థాన్ ది మేకపోతు గాంభీర్య అని నిపుణులు అంటున్నారు.

Operation Sindoor: అమాయకులను చంపుతారా..? ఇండియాకు పాకిస్థాన్‌ ఆర్మీ ప్రతినిధి చౌదరి వార్నింగ్‌
Ahmed Shareef Choudhary

Updated on: May 07, 2025 | 5:29 PM

ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ సంయుక్తంగా ఆపరేషన్‌ సిందూర్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా.. పాకిస్థాన్‌తో పాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకొని.. భారత్‌ విరుచుకుపడింది. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై ఈ దాడులు నిర్వహించినట్లు ఇండియన్‌ ఆర్మీ, నేవీ ప్రతినిధులు సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్‌ తెలిపారు. అయితే.. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారత్‌ చేపట్టిన ఈ ఆపరేషన్‌ సిందూర్‌పై తాజాగా పాకిస్థాన్‌ ఆర్మీ ప్రతినిధు అహ్మద్‌ షరీఫ్‌ చౌదరి స్పందిస్తూ.. ఇండియాకు వార్నింగ్‌ ఇచ్చారు.

“శత్రు దేశం ఇండియా, మన దేశంపై దాడికి పాల్పడింది. అమయాకులను పొట్టబెట్టుకుంది. మొత్తం 6 ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 8 మంది పాకిస్థానీయులు మరణించారు. 35 మంది గాయపడ్డారు. ఓ ఇద్దరి ఆచూకీ లభించడం లేదు. ఇప్పటి వరకు జరిగిన నష్టానికి సంబంధించిన ఉన్న సమాచారం ఇది. అయితే ఈ దాడికి కచ్చితంగా ధీటైన జవాబు ఇస్తాం. పాకిస్థాన్‌ పౌరుల తరఫున ప్రతీకారం తీర్చుకుంటాం” అంటూ ఆయన పేర్కొన్నారు.

కాగా, ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత.. ప్రతీకారం అంటూ పాకిస్థాన్‌ కానీ, ఉగ్రవాదులు కానీ ఏవైన చర్యలకు దిగితే.. ఈసారి మరింత గట్టిగా దెబ్బ కొడతామంటూ భారత్‌ ప్రభుత్వం కూడా ఇప్పటికే స్పష్టం చేసింది. తర్వాత జరగబోయే పరిణామాలపై ఇప్పటికే ప్రధాని మోదీ కాబినేట్‌ మంత్రులతో చర్చించారు. మరి నిజంగానే పాకిస్థాన్‌ ప్రతిదాడి చేస్తుందా? లేక మేకపోతు గాంభీర్య ప్రదర్శిస్తుందా అనేది చూడాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి