AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఆగ్రదేశాధి నేతలు.. ట్రంప్, పుతిన్‌ సహా పలువురి స్పందన ఇదే

జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్‌లో మంగళవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఇద్దరు విదేశీయులు సహా 28 మంది పర్యాటకులు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. 2019లో పుల్వామా దాడి తర్వాత జమ్మూ లోయలో జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇదే. ఈ విషాద సమయంలో యావత్‌ ప్రపంచం భారత్‌కి సంఘీభావం, మద్దతు తెలిపాయి..

Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఆగ్రదేశాధి నేతలు.. ట్రంప్, పుతిన్‌ సహా పలువురి స్పందన ఇదే
Pahalgam Terror Attack
Srilakshmi C
|

Updated on: Apr 23, 2025 | 9:38 AM

Share

పహల్గాం, ఏప్రిల్‌ 23: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడి యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పుల్వామా దాడి తర్వాత జమ్ముకశ్మీర్‌ లోయలో జరిగిన మరో అతి పెద్ద దాడి ఇదే. జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్‌లో మంగళవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఇద్దరు విదేశీయులు సహా 28 మంది పర్యాటకులు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. 2019లో పుల్వామా దాడి తర్వాత జమ్మూ లోయలో జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇది. నిషేధిత లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి బాధ్యత వహించింది. బైసరన్ లోయలో ఉగ్రమూక పర్యాటకులపై అనేక రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం అడవుల్లోకి పరుగులు తీసి అదృశ్యమయ్యారు. దీంతో మంత్రి అమిత్ షాతో పాటు ప్రధాని మోదీ కాశ్మీర్ చేరుకున్నారు. ఈ విషాద సమయంలో యావత్‌ ప్రపంచం భారత్‌కి సంఘీభావం, మద్దతు తెలిపాయి.

ఈ సంఘటన తీవ్ర కలతపెట్టేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా స్పందించారు. కాశ్మీర్ నుంచి వస్తున్న వార్తలు తీవ్ర కలతపెట్టేవిగా ఉన్నాయన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశంతో అమెరికా బలంగా నిలుస్తుంది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు కోలుకోవాలని ప్రార్థిస్తున్నామన్నారు. ప్రధానమంత్రి మోదీకి, భారత్‌కు పూర్తి మద్దతు, ప్రగాఢ సానుభూతి ఉన్నాయన్నారు. అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ట్రంప్‌ ఈ దాడిని ఖండించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ ఉగ్రవాద దాడిని ఖండించారు. భారత్‌కు అండగా నిలిచారు. ఈ ఘటనకు కారణమైన వారికి శిక్ష పడాల్సిందే అన్నారు. భారత్ పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కూడా ఈ దాడిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పహల్గామ్‌లో జరిగిన వినాశకరమైన ఉగ్రవాద దాడి బాధితులకు సంతాపాన్ని తెలియజేశారు.

ఉగ్రదాడి జరిగిన సమయంలో సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అధికారిక పర్యటనను రద్దు చేసుకుని బుధవారం ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిపై సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ సైతం విచారాన్ని వ్యక్తం చేశారు. సౌదీ అరేబియా భారత్‌కి అండగా ఉంటుందని, ఈ దుఃఖ సమయంలో అవసరమైన సహాయాన్ని అందిస్తుందని అన్నారు. ఇక ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాద దాడి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు, గాయపడిన వారికి, ప్రభుత్వానికి ఇటలీ తన సానుభూతిని తెలియజేస్తోందని ఎక్స్‌ సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్టు పెట్టారు. కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండించిన మొదటి దేశాలలో ఇజ్రాయెల్ ఒకటి. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు ఇజ్రాయెల్ మద్దతుగా నిలుస్తుందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

ఇవి కూడా చదవండి

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఉగ్రవాద దాడిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీవ్రంగా ఖండించింది. భారత ప్రభుత్వానికి, ఈ దారుణ దాడిలో బాధితుల కుటుంబాలకు యుఏఈ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేసింది. ఇరాన్ ప్రభుత్వం కూడా సంతాపాన్ని తెలిపింది. కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని శ్రీలంక ప్రభుత్వం సైతం ఖండించింది. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేసింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని పేర్కొంది. ఉగ్రవాద వ్యతిరేకంగా పోరాటంలో శ్రీలంక ప్రభుత్వం.. భారతకు సంఘీభావం తెలిపింది.

ఇక దేశ వ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు సైతం ఈ దాడిని ఖండించారు. ఉగ్రదాడి పిరికిపంద చర్య అని రాహుల్‌ గాంధీ అన్నారు. మృతుల కుటుంబాలకు సోనియా గాంధీ సానుభూతి తెలిపారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌, వైసీపీ అధినేత జగన్‌ కూడా దాడిని ఖండించారు. అటు తెలంగాణ సీఎం రేవంత్‌ ఉగ్రదాడిపై స్పందించారు. ఇలాంటి చర్యలతో భారతీయుల ఆత్మస్థైర్యం దెబ్బతీయలేరన్నారు. అటు కేసీఆర్‌, కేటీఆర్‌ కూడా మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.