Padma Bhushan: పాట సమ్మోహనం.. పాటకు ఆమె ఆరో ప్రాణం.. సుమధుర గానంతో అలరించిన వాణీ జయరామ్‌ను పద్మభూషణ్ పురస్కారం..
పెళ్లి తర్వాత ముంబైలో స్థిరపడ్డ వాణీ జయరాం.. అనుకోనివిధంగా సూపర్ హిట్ హిందీ మూవీ గుడ్డి ద్వారా సినీ సంగీత ప్రచంచంలోకి అడుగుపెట్టారు.
![Padma Bhushan: పాట సమ్మోహనం.. పాటకు ఆమె ఆరో ప్రాణం.. సుమధుర గానంతో అలరించిన వాణీ జయరామ్‌ను పద్మభూషణ్ పురస్కారం..](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/01/singer-vani-jayaram-gets-padma-bhushan.jpg?w=1280)
ఆమె పాట సమ్మోహనపరుస్తుంది, పరవశింపజేస్తుంది.. మళ్లీమళ్లీ వినాలనిపిస్తుంది. కోయిలమ్మ కూసినట్టు, గలగలా గోదారి పరుగులు పెట్టినట్టు ఉంటాయి ఆమె పాటలు. ఆమె ఎవరో కాదు ప్లేబాక్ సింగర్ వాణీ జయరాం. దాదాపు 19 భాషాల్లో తన సుమధుర గానంతో అలరించిన వాణీ జయరామ్‌ను పద్మభూషణ్ పురస్కారం వరించింది. వాణీ జయరాం స్వస్థలం తమిళనాడులోని వెల్లూరు. 1945 నవంబర్ 30న ఆమె జన్మించారు. 8వ ఏటనే ఆలిండియా రేడియోలో పాట పాడి అబ్బురపర్చిన బాల మేధావి వాణీ జయరాం. ఆ తర్వాత కర్నాటక, హిందుస్తానీ సంగీతం నేర్చుకుని.. నేపథ్య గాయనిగా మారారు. అయితే, వాణీ జయరాం సినీ ఎంట్రీ విచిత్రంగా జరిగింది. పెళ్లి తర్వాత ముంబైలో స్థిరపడ్డ వాణీ జయరాం.. అనుకోనివిధంగా సూపర్ హిట్ హిందీ మూవీ గుడ్డి ద్వారా సినీ సంగీత ప్రచంచంలోకి అడుగుపెట్టారు. బోలె రే పపీ హరా పాటతో నేపథ్య గాయకురాలిగా ఆరంగేట్రం చేశారు వాణీ జయరాం.
వాణీ జయరామ్ 1971 నూతన సంవత్సరం రోజున విడుదలైన హిందీ చిత్రం ‘GUDDI’లో వసంత్ దేశాయ్ స్వరపరిచిన ‘బోలే రే బాబీ హరా’ పాటను పాడి ప్లేబ్యాక్ సింగర్‌గా అరంగేట్రం చేసింది. ఆమె మొదటి పాట భారీ హిట్ అయిన తర్వాత, ఆమె సంగీత దర్శకులు కోరుకునే ప్రధాన గాయనిగా మారింది. హిందీ తరువాత, అతను తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, తుళు, గుజరాతీ, ఒడియా, బెంగాలీ వంటి 10 కంటే ఎక్కువ భాషలలో పాడటం ద్వారా ప్రసిద్ధి చెందాడు.
వాణీ జయరాం పాడిందంటే ఆ పాట సూపర్ హిట్టే, ఎందుకంటే పాటకు ఆమె ప్రాణం పోస్తుంది. పాటకు ఆరో ప్రాణంలా మారుతుంది ఆమె గాత్రం. మనసు పులకించేలా, తనువు పరవశించేలా ఉంటుంది ఆమె పాట. ఎంతటి కష్టమైన పాటనైనా అలవోకగా పాడగల సామర్ధ్యం వాణీ జయరాం సొంతం. అందుకే ఆమెను మూడుసార్లు జాతీయ అవార్డులు వరించాయ్.
తెలుగు పాటకు పల్లకీ ఆమె గాత్రం, ఆమె గొంతులో ఎన్నో అద్భుతమైన పాటలెన్నో ప్రాణం పోసుకున్నాయ్. తన గానామృతంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేశారు వాణీ జయరాం. మానస సంచరరే, దొరకునా ఇటువంటి సేవ, ఎన్నెన్నో జన్మల బంధం నీదీనాదీ, ఆనతినీయరా… లాంటి మధురమైన పాటలతో తెలుగులో తన ముద్ర వేసుకున్నారు వాణీ జయరాం.
వెయ్యికి పైగా సినిమాలు, 20వేలకు పైగా పాటలు, ఇదీ వాణీ జయరాం తిరుగులేని రికార్డు. కేవలం మూవీ సాంగ్సే కాదు, వేల సంఖ్యలో భక్తి గీతాలను ఆలపించారు వాణీ జయరాం. 1971లో తన సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించి ఐదు దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మళయాలం, ఒరియా, హిందీతోపాటు మొత్తం 19 భాషల్లో పాటలు పాడిన ఘనత వాణీ జయరామ్‌ది.
వాణీ జయరామ్‌ది ప్రత్యేకమైన గొంతు. తన గాత్రంతో భారత సంగీత ప్రియులను ఊలలాడించారు వాణి. ఆమె పాటిన ప్రతి పాటా ఆణిముత్యమే. మెలోడీ సాంగ్స్‌కి తన గాత్రంలో ప్రాణం పోశారామె. ఆమె గొంతులోని మాధుర్యం విని పరవశించిపోయారు ప్రేక్షకులు. గొప్పగొప్ప సంగీత దర్శకులతో పనిచేశారామె.
తెలుగులో పాడింది తక్కువ పాటలే అయినా, తెలుగు పాటలతోనే రెండుసార్లు జాతీయ అవార్డులు గెలుచుకున్నారు వాణి. తమిళ్ మూవీ అపూర్వ రాగంగళ్‌తో మొదటిసారి నేషనల్ అవార్డుకి ఎంపికైన వాణి, ఆ తర్వాత తెలుగు సినిమాలైన శంకరాభరణం, స్వాతికిరణంతో రెండుసార్లు జాతీయ ఉత్తమ గాయనిగా నిలిచారు.
వాణీ జయరాం గాత్రం అప్పుడూఇప్పుడూఎప్పుడూ ఎవర్‌గ్రీనే. ఎందుకంటే, ఆమె గొంతులోనే ఏదో అద్భుతముంది, మైమరిపించే మాయ ఉంది. అందుకే, కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు వాణీ, ఇప్పుడు భారత అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్‌ను సైతం తన వశం చేసుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం