Bombay Municipal Corporation : మాస్కులు ధరించనందుకు ముంబైలో 22 లక్షల మందికి పైగా జరిమానా విధించారు. బొంబే మునిసిపల్ కార్పొరేషన్, సివిల్ పోలీసులు, రైల్వే అధికారులు మూకుమ్మడిగా ఈ ఫైన్‌లు విధించారు. అయితే ఈ మూడు ఏజెన్సీలు కలిపి వసూలు చేసిన ఫైన్లు రూ.44.5 కోట్లు దాటింది. మార్చి 20న బీఎంసీ 1412 మందికి జరిమానా విధించగా.. సుమారు రూ.28 లక్షలు వసూలు చేసింది. ముంబై పోలీసులు 6789 మందికి జరిమానా విధించగా రూ.53.5 లక్షలు వసూలు చేసింది. రైల్వే 489 మందికి జరిమానా విధించగా రూ. 97000లను వసూలు చేసింది. నగరంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో బీఎంసీ తన డ్రైవ్‌ను ముమ్మరం చేసింది. చాలామంది ప్రజలు మాస్కులు ధరించకుండా బయట తిరుగుతుండటంతో ఫైన్లు వేయాల్సి వస్తోందని వివరణ ఇచ్చింది.
ఈ విషయంలో బీఎంసీ మేయర్ కిషోరి పెడ్నేకర్ గత నెలలో మాస్కులు ధరించని వారికి జరిమానా విధించవద్దని తెలిపారు. బీఎంసీ అధికారులు ప్రజలతో తప్పుగా ప్రవర్తించవద్దని కోరారు. ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే పొటో, వీడియో తీసి బీఎంసీ అధికారులకు నివేదించాలని సూచించారు. ఎందుకంటే నిరంతర ఆంక్షలతో ప్రజలు ఇప్పటికే బాధపడుతున్నారు. వాటిని అర్థం చేసుకొని అధికారులు ప్రవర్తించాలన్నారు. ఫైన్లు వేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మన లక్ష్యం డబ్బు సంపాదించడం కాదు మాస్కులు ధరించేలా చేయడం మాత్రమే అని గుర్తించాలి.