న్యూఢిల్లీ, అక్టోబర్ 29: కొన్ని నెలల క్రితం టమాట ధరలు దేశ వ్యాప్తంగా బెంబేలెత్తించిన సంగతి తెలిసిందే. కిలో టమాట ఏకంగా రూ.300లకుపైగా పలికింది. దీంతో కొనలేక.. తిన లేక సామాన్యుడు తలకిందులయ్యాడు. ఇప్పుడు ఉల్లి కూడా అదే బాట పట్టింది. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు ఘాటెక్కిస్తున్నాయి. రిటైల్ మార్కెట్‌లో ప్రస్తుతం కిలో రూ.70కి అమ్ముడవుతోంది. ఉల్లిపాయలు ధరల పెరుగుదల క్రమంగా పుంజుకుంటోంది. నవంబర్ మొదటి వారం నాటికి కిలో ఉల్లి రూ.100కి చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు వారాల్లోనే ఉల్లిధర కిలో రూ.30 నుంచి రూ.70కి చేరిపోయింది.
ఉత్తర భారతంలోని ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా రాష్ట్రాల్లో నవరాత్రులు ముగిసిన తర్వాత ఉల్లి ధరలు పెరుగడం ప్రారంభమయ్యాయి. గత కొన్ని రోజులుగా హోల్‌సేల్ మార్కెట్ యార్డులలో ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రస్తుతం క్వింటాల్ ధర రూ.4 వేలకు చేరడంతో పాటు రిటైల్ మార్కెట్‌లో ధరలు కూడా పెరిగాయి. మరోవైపు రిటైల్ మార్కెట్‌లో కర్నూలు ఉల్లి కిలో రూ.60కి, మహారాష్ట్ర రకం ఉల్లి కిలో రూ.70కి పలుకుతోంది. వ్యాపారులు వివిధ కారణాలను చూపుతూ నాణ్యత లేని ఉల్లిని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఉల్లి ధర మరింత పెరుగుతుందని వారు అంచనా వేస్తున్నారు. సరఫరా తగ్గి డిమాండ్ పెరగడం వల్లనే ఉల్లి ధరలకు రెక్కలు వచ్చినట్లు వ్యాపారులు అంటున్నారు. భిన్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఉల్లి ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో డిమాండ్ – సరఫరా మధ్య అంతరం ఏర్పడి ఉల్లి ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయి.
ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో సామాన్యుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో అల్లం ధర రూ.160 నుంచి రూ.200 వరకు పలుకుతోంది. మహారాష్ట్ర నుంచి సరఫరా తగ్గిపోవడంతో ప్రస్తుతం విశాఖపట్నంలో 40 టన్నులు మాత్రమే లభ్యమవుతున్నాయి. పనాజీలో వారం రోజుల క్రితం కిలో రూ.50కి విక్రయించిన ఉల్లి ఇప్పుడు రూ.60కి చేరింది. బెలగావిలో హోల్‌సేల్ వ్యాపారులు వసూలు చేసే అధిక ధరల కారణంగా ఈ పెరుగుదల గోవాలో ధరలపై ప్రభావం చూపుతుంది. పొరుగు రాష్ట్రాల్లో అస్థిరమైన రుతుపవనాలు పంటల ఉత్పత్తి తగ్గడానికి దారితీసింది. ఫలితంగా ఉత్పత్తి తగ్గి ధరలు పెరిగాయి. వినియోగదారులు ఉల్లికి ప్రత్యామ్నాయం చూస్తున్నారు. వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి కేంద్రం బఫర్ ఉల్లి విక్రయాలను వేగవంతం చేసింది. ధరల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం బఫర్ స్టాక్ నుంచి 1.70 లక్షల టన్నుల ఉల్లి నిల్వలను మార్కెట్‌లో విడుదల చేసింది. రానున్న రోజుల్లో మరింత ఉల్లి స్టాక్‌ను విడుదల చేసే అవకాశాలున్నాయి. శనివారం ఢిల్లీలోని 400 సఫల్ రిటైల్ స్టోర్లలో కేజీ ఉల్లి రూ.67కు విక్రయించారు.
బఫర్ ఉల్లి విక్రయాల కింద రిటైల్ మార్కెట్‌లలో కిలోకు రూ. 25 సబ్సిడీ రేటుతో ఉల్లిపాయలను కేంద్రం విక్రయిస్తోంది. ఉల్లిపాయ సగటు రిటైల్ ధర 57% పెరిగి కిలో రూ.47కి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆగస్టు నెల మధ్య నుంచి బఫర్ ఉల్లిపాయలను అందిస్తోంది. ధరల పెరుగుదలను నియంత్రించడానికి రిటైల్ అమ్మకాలను పెంచాలని యోచిస్తోంది. ఖరీఫ్ ఉల్లి నాట్లు ఆలస్యం కావడం, నిల్వ ఉన్న రబీ ఉల్లి అయిపోవడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లభ్యతను మెరుగుపరచడానికి, ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం ఈ సంవత్సరం బఫర్ ఉల్లి స్టాక్‌ను రెట్టింపు చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.