ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయివేటు రంగంలో ఏడాది అనుభవం మస్ట్.. ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

|

Nov 09, 2022 | 12:57 PM

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇక కొత్త అభ్యర్థులను నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలకు తీసుకోబోమని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగ..

ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయివేటు రంగంలో ఏడాది అనుభవం మస్ట్.. ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
Goa Cm Pramod Sawant
Follow us on

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇక కొత్త అభ్యర్థులను నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలకు తీసుకోబోమని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలకు ఒక ఏడాది పని అనుభవం తప్పనిసరి చేయనున్నట్లు ప్రకటించారు. ఉత్తర గోవా జిల్లాలోని తలీగావో గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ద్వారా రిక్రూట్‌మెంట్‌ను తప్పనిసరి చేస్తామని చెప్పారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఏడాది పని అనుభవం తప్పనిసరి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువత ముందు ప్రైవేట్ రంగంలో పని చేసిన అనుభవం పొందాలని అన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు తగిన అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేసేలా రిక్రూట్‌మెంట్ రూల్స్‌లో అవసరమైన సవరణలు చేయనున్నట్లు గోవా సీఏం తెలిపారు. నైపుణ్యం కలిగిన మానవవనరుల ఎంపిక కోసం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నేరుగా దరఖాస్తు చేసుకోవాలని, మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరగకూడదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిధులు ఉద్యోగాలు ఇచ్చే వారు కాదని, ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తే అర్హులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

గోవాలో గత ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా యువతను ఆకర్షించేందుకు అనేక హామీలను గుప్పించింది. అయితే యువత మాత్రం బీజేపీ వైపు మొగ్గుచూపారు. దీంతో ప్రమోద్ సావంత్ మరోసారి సీఏం అయ్యారు. తాజాగా గోవా ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువతకు కొంత నిరాశ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గోవా సీఏం ప్రమోద్ సావంత్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. చదువు పూర్తైన తర్వాత ఎటువంటి అనుభవం లేకుండా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందనే భావనలో చాలా మంది ఉన్నారని, అందుకే ప్రయివేట్ రంగంలో అనుభవం తప్పనిసరి చేశామని, దీని ద్వారా బాధ్యతలు తెలుస్తాయని, ప్రభుత్వ ఉద్యోగాన్ని మరింత బాధ్యతతో నిర్వర్తించే అవకాశం ఉంటుందనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..