బెర్హంపూర్, ఫిబ్రవరి 14: ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ మహిళ చనిపోయింది. అంతా కన్నీరుమున్నీరుగా విలపించారు. చివరకు దహన సంస్కారాలు నిర్వహించాలని స్మశాన వాటికకు తీసుకొచ్చారు. చితి కూడా సిద్ధం చేశారు. మరికొద్ది క్షణాల్లో చితికి నిప్పటించడానికి సిద్ధం అవుతుండగా.. మృతి చెందిన మహిళ ఒక్కసారిగా కళ్లు తెరిచింది. దీంతో కుటుంబ సభ్యులతోపాటు అక్కడున్న వారంతా ఒక్కసారిగా హడలెత్తిపోయారు. ఈ షాకింగ్ ఘటన ఒడిశాలోని బెర్హంపూర్ నగరంలో మంగళవారం (ఫిబ్రవరి 13) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
ఒడిశాలోని బెర్హంపూర్ నగరానికి చెందిన బుజ్జమ్మ (52) అనే మహిళ తన ఇంట్లో ఫిబ్రవరి1వ తేదీన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ప్రమాదంలో 50 శాతంకి పైగా ఆమె శరీరంపై కాలిన గాయాలయ్యాయి. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు MKCG మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌కు తీసుకొచ్చి చికిత్స అందించారు. చికిత్స చేసినప్పటికీ ఆమె పూర్తిగా కోలుకోలేదు. మెరుగైన వైద్యం కోసం వైద్యులు మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించగా.. నిరుపేద కుటుంబం కావడంతో చేసేది లేక ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ప్రాణాలతో పోరాడుతోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 13వ తేదీన ఆమె ఊపిరి పీల్చుకోవడం లేదని, కళ్లు తెరవడం లేదని ఆమె భర్త సిబారం బంధువులకు తెలిపాడు.
దీంతో ఆమె చనిపోయిందని అందరూ భావించారు. బుజ్జమ్మ కుటుంబం అంతగా కలిగినది కాదు. దీంతో ఆమె భర్త సిబారాం బుజ్జమ్మ అంత్య క్రియల నిమిత్తం స్థానికుల నుంచి డబ్బు వసూలు చేశాడు. అనంతరం మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లడానికి స్థానికుల సహాయంతో వాహనం ఏర్పాటు చేశారు. వ్యాన్‌లో బుజ్జమ్మ మృతదేహాన్ని బీజాపూర్‌లోని శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అయితే అక్కడ చితి ఏర్పాటు చేస్తుండగా బుజ్జమ్మ ఒక్కసారిగా కళ్లు తెరచింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. బుజ్జమ్మ బతికే ఉందని నిర్ధారణ కావడంతో అదే వ్యాన్‌లో ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. దహన సంస్కారాలకు కొద్ది నిమిషాల ముందు మహిళ కళ్లు తెరవడంతో చుట్టు పక్కల ప్రాంతాలకు ఈ వార్త దావానంలా పాకింది. దీంతో మహిళను చికిత్స నిమిత్తం మళ్లీ ఆస్పత్రికి తరలించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.