Odisha Train Accident: సవాల్‌గా మారిన మృతదేహాల గుర్తింపు.. ఏఐ సాంకేతికత సాయంతో..

Odisha Coromandel Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో చనిపోయిన వారిని గుర్తించడం సవాల్‌గా మారింది. ముఖాలు ఛిద్రమవడంతో చనిపోయింది ఎవరో గుర్తు పట్టలేని దుస్థితి. 288 మంది ప్రాణాలు కోల్పోగా.. అందులో 83 మృతదేహాలను ఇంకా గుర్తించలేదు.

Odisha Train Accident: సవాల్‌గా మారిన మృతదేహాల గుర్తింపు.. ఏఐ సాంకేతికత సాయంతో..
Odisha Train Accident

Updated on: Jun 08, 2023 | 9:45 PM

Odisha Coromandel Train Accident: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో దాదాపు 288 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే వారిలో కొందరిని గుర్తించినప్పటికీ.. 83 మందిని మాత్రం గుర్తించడం సాధ్యం కావడం లేదు. వారి మృతదేహాలు పూర్తిగా దెబ్బ తినడంతో వారిని గుర్తించడం అధికారులకు సవాల్‌గా మారింది. ఇప్పటికీ వాళ్ల మృత దేహాలు మార్చురీలోనే ఉండిపోయాయి. ఈక్రమంలో మృతులను గుర్తించేందుకు అధికారులు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకుంటున్నారు. మృతులను గుర్తించేందుకు రైల్వే అధికారులు తొలుత ఆధార్‌ నిపుణులను రప్పించి మృతదేహాల నుంచి వేలి ముద్రలు తీసుకునేందుకు ప్రయత్నించారు. కానీ, చాలామంది చేతుల వేళ్లు బాగా దెబ్బతినడం, మృతదేహాలు కూడా అనుకూలంగా లేకపోవడంతో వేలి ముద్రలు తీసుకోవడం సాధ్యం కాలేదు.

దీంతో కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేసే సంచార్‌ సాథీ పోర్టల్‌ను ఇందుకు వినియోగించారు. దీని ద్వారా ఇప్పటి వరకు 45 మందిని గుర్తించారు. మృతుల ఫొటో ఆధారంగా వారి ఫోన్ నంబర్, ఆధార్ వంటి వివరాలను ఆ పోర్టల్ సేకరించి అధికారులకు అందజేసింది. వాటి ఆధారంగా అధికారులు కుటుంబసభ్యులను సంప్రదించి మృతదేహాలను అప్పగిస్తున్నారు. ఇలానే మిగతా వారి వివరాలను కూడా సేకరిస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు ప్రమాదానికి కొంత సమయం ముందు ఏయే నంబర్లు యాక్టివ్‌గా ఉండి, ప్రమాదం జరిగిన వెంటనే కట్‌ అయ్యాయనే విషయాన్ని సెల్‌ఫోన్‌ టవర్ల సిగ్నల్స్‌ ద్వారా విశ్లేషిస్తున్నారు.

ఇక ప్రమాదానికి సరిగ్గా 20 సెకన్ల ముందు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ వ్యక్తి తీసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఏసీ బోగీలో పారిశుధ్య కార్మికుడు ఫ్లోర్‌ క్లీన్‌ చేస్తున్న సమయంలో ఈ వీడియో తీశారు. మాప్‌ చేస్తున్న సమయంలో ఆ బోగీలో ఉన్న కొందరు ప్రయాణికులు నిద్రిస్తున్నారు. అయితే ఒక్కసారి రైలు జర్క్‌ ఇచ్చింది. ఇక ఆ జెర్క్‌తో కెమెరా షేక్‌ అయ్యింది. అదే సమయంలో పెద్ద కుదుపు, అరుపులు వినిపిస్తున్నాయి. ఓ ప్రయాణికుడు ఈ వీడియోను రికార్డ్‌ చేసి వుండవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..